PropEquity: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ జోరు.. 11% పెరిగిన ఇళ్ల విక్రయాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోళ్లకు గిరాకీ మందగించడం, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు తగ్గడంతో జులై-సెప్టెంబరు త్రైమాసికంలో గృహ విక్రయాలు క్షీణించాయి. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు గతేడాదితో పోలిస్తే 6 శాతం తగ్గి 1.03 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. అయితే హైదరాబాద్‌లో మాత్రం గృహ విక్రయాలు 11 శాతం పెరిగాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కూడా కొనుగోలుదారుల సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు ప్రముఖ స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్‌ఈక్విటీ వెల్లడించింది. ముంబయి, నవీ ముంబయి, థానే, దిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతా నగరాల్లోని ప్రాథమిక నివాస గృహ మార్కెట్లపై ప్రాప్‌ఈక్విటీ ఈ విశ్లేషణ నిర్వహించింది.
వివరాలు
1,09,420 యూనిట్లు ఇళ్ల విక్రయాలు
గతేడాది జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఈ 9 నగరాల్లో మొత్తం 1,09,420 ఇళ్ల యూనిట్లు విక్రయమయ్యాయి.
ఈ ఏడాది అదే కాలంలో విక్రయాలు 1,03,170 యూనిట్లకు తగ్గాయి. ఇదే సమయంలో కొత్త ఇళ్ల సరఫరా కూడా తగ్గింది.
గతేడాది జులై-సెప్టెంబరు మధ్య 1,00,330 కొత్త యూనిట్లు మార్కెట్లోకి రాగా.. ఈసారి ఆ సంఖ్య 98,165 యూనిట్లకు పడిపోయింది.
వివరాలు
వర్షాకాల ప్రభావం.. డిసెంబరులో గిరాకీ పెరిగే అవకాశం
సాధారణంగా వర్షాకాలం కారణంగా జులై-సెప్టెంబరు త్రైమాసికంలో నిర్మాణ సంస్థలు కొత్త ప్రాజెక్టుల ప్రారంభాన్ని వాయిదా వేస్తుంటాయి.
దీంతో ఈ కాలంలో ఇళ్ల విక్రయాలపై కూడా ప్రభావం పడుతుంది. అయితే డిసెంబరు త్రైమాసికంలో పండగల గిరాకీ కారణంగా ఇళ్ల విక్రయాలు పెరిగే అవకాశం ఉందని ప్రాప్‌ఈక్విటీ నివేదిక పేర్కొంది.
ఈ గిరాకీని అందిపుచ్చుకునేందుకు డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను మార్కెట్లోకి తీసుకురావడంతో పాటు వివిధ రకాల ఆఫర్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
వివరాలు
నగరాల వారీగా గృహ విక్రయాల పరిస్థితి
హైదరాబాద్
నగరంలో ఇళ్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది జులై-సెప్టెంబరు మధ్య 13,890 యూనిట్లు విక్రయించగా.. ఈసారి 11 శాతం వృద్ధితో 15,470 యూనిట్లకు చేరాయి.
బెంగళూరు
గతేడాది 17,170 యూనిట్లు అమ్ముడవగా.. ఈసారి 1 శాతం పెరుగుదలతో 17,340 యూనిట్లకు చేరాయి.
నవీ ముంబయి
ఇళ్ల విక్రయాలు 12 శాతం వృద్ధి చెందాయి. గతేడాది 8,730 యూనిట్లు విక్రయించగా.. ఈసారి 9,810 యూనిట్లకు పెరిగాయి.
ముంబయి
ప్రధాన ముంబయి నగరంలో గృహ విక్రయాలు 8 శాతం తగ్గాయి.
థానే
ఇళ్ల విక్రయాల్లో 11 శాతం క్షీణత నమోదైంది.
పుణె
గతేడాదితో పోలిస్తే గృహ విక్రయాలు 16 శాతం తగ్గాయి.
దిల్లీ
ఇళ్ల విక్రయాల్లో 12 శాతం క్షీణత కనిపించింది.