LOADING...
DGCA: ఫిబ్రవరి వరకు సర్వీసులు తగ్గించండి.. ఇండిగోకు డీజీసీఏ ఆదేశం?
DGCA: ఫిబ్రవరి వరకు సర్వీసులు తగ్గించండి.. ఇండిగోకు డీజీసీఏ ఆదేశం?

DGCA: ఫిబ్రవరి వరకు సర్వీసులు తగ్గించండి.. ఇండిగోకు డీజీసీఏ ఆదేశం?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

పైలట్ల కొరతతో ఏర్పడిన సంక్షోభ నేపథ్యంలో, రోజువారీ విమాన సర్వీసుల సంఖ్యను ఫిబ్రవరి వరకూ తగ్గించుకోవాలని ఇండిగోను డీజీసీఏ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెలలోనే ఇప్పటివరకూ 5,000కుపైగా ఇండిగో విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. సాధారణంగా రోజుకు సుమారు 2,300 సర్వీసులను నడిపే సంస్థ, ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా శీతాకాల షెడ్యూల్‌లో భాగంగా రోజుకు దాదాపు 300 విమానాలను తగ్గించమని నియంత్రణ సంస్థ ఆదేశించే వీలుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ శీతాకాల షెడ్యూల్ మార్చి చివరి వరకూ కొనసాగనుంది. ఫిబ్రవరిలోపు 158 మంది పైలట్లను నియమిస్తామని ఇండిగో ప్రకటించిన నేపథ్యంలో, కొత్త నియామకాలు పూర్తయ్యే వరకూ సర్వీసులను తగ్గించుకోవాలని డీజీసీఏ సూచించనుందని తెలుస్తోంది.

వివరాలు 

ఇండిగో రుణ రేటింగ్‌పై ప్రతికూల ప్రభావం: మూడీస్ 

శీతాకాలంలో ప్రయాణ డిమాండ్ ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, డిమాండ్‌కు అనుగుణంగా విమాన సర్వీసులు పెంచాల్సిందిగా ఎయిరిండియా, ఇతర విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించొచ్చని అంటున్నారు. సిబ్బంది కొరతతో పాటు పర్యవేక్షణ, నిర్వహణ లోపాల కారణంగా ఇండిగో విమానాల రద్దులు భారీగా చోటుచేసుకుంటున్నాయి. నవంబరులో 755 సర్వీసులు రద్దయితే, ఈ నెలలో ఇప్పటికే 5,000కు మించి విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. దీని వల్ల సంస్థ ఆదాయం తీవ్రంగా దెబ్బతింటోందని మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. రద్దైన టికెట్లకు సంబంధించి ప్రయాణికులకు రిఫండ్‌గా రూ.610 కోట్లను చెల్లిస్తున్నట్లు ఇండిగో ఇటీవల ప్రకటించింది.

వివరాలు 

ఇండిగో రుణ రేటింగ్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి:  మూడీస్‌ 

సర్వీసుల పెరుగుదల దృష్ట్యా మరిన్ని పైలట్ల అవసరం 22 నెలల క్రితమే తెలిసినా, వారిని సమయానికి నియమించుకోవడంలో ఇండిగో నిర్లక్ష్యం ప్రదర్శించిందని మూడీస్‌ విమర్శించింది. రోజుకు వందలంతగా విమానాలు రద్దవుతుండటంతో కంపెనీ ఆదాయ నష్టం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల, ప్రభుత్వ జరిమానాలకు కూడా సంస్థ గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఇవన్నీ కలిసి ఇండిగో రుణ రేటింగ్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని మూడీస్‌ స్పష్టం చేసింది. కొత్త విమానయాన నిబంధనల అమలులో సంస్థకు తాత్కాలిక ఉపశమనం లభించినా, వాటిని సమర్థంగా అమలు చేయడంలో విఫలమవడం రేటింగ్‌పై ప్రతికూలతను మరింత పెంచుతోందని సంస్థ విశ్లేషించింది.

Advertisement

వివరాలు 

వినియోగ లోపాలే కారణం 

ఫ్లైట్‌ రద్దులు, టికెట్‌ రిఫండ్‌ చెల్లింపులు, ప్రయాణికులకు పరిహారాలు వంటి అంశాల వల్ల ఆదాయం భారీగా తగ్గే అవకాశం ఉందని, ఈ భారం రుణ రేటింగ్‌ను మరింత దెబ్బతీస్తుందని మూడీస్‌ వివరించింది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులకు ఇండిగో ప్రణాళిక లోపాలు, పర్యవేక్షణ బలహీనత, వనరుల సరైన వినియోగ లోపాలే కారణమని స్పష్టం చేసింది. ఇండిగో సర్వీసులు రద్దవుతూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు వారికి అండగా నిలిచాయి. అర్హులైన ప్రయాణికులకు వన్‌టైమ్‌ సడలింపుల కింద తేదీ మార్పిడిపై, రద్దు చార్జీలపై మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించాయి.

Advertisement

వివరాలు 

ప్రయాణికులకు ఎయిరిండియా బాసట 

డిసెంబర్‌ 4లోపు టికెట్లు బుక్‌ చేసుకుని, డిసెంబర్‌ 15 వరకూ ప్రయాణ తేదీలు ఉన్నవారు ఎలాంటి అదనపు రుసుములు చెల్లించకుండా తేదీలను మార్చుకునే అవకాశం ఉంటుందని తెలిపాయి. టికెట్‌ను పూర్తిగా రద్దు చేసుకుంటే పూర్తి రిఫండ్‌ కూడా ఇస్తున్నాయి. ఈ సౌకర్యం డిసెంబర్‌ 8 వరకూ అందుబాటులో ఉంటుంది. మార్పు చేసుకున్న కొత్త తేదీకి టికెట్‌ ధర ఎక్కువ ఉంటే,ఆ తేడాను మాత్రమే ప్రయాణికులు చెల్లించాలన్నారు. ఇందుకోసం తమ 24x7 కాల్‌ సెంటర్లను లేదా ట్రావెల్‌ ఏజెంట్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులు తమ చాట్‌బాట్‌ 'టియాను'ను కూడా వినియోగించుకోవచ్చని తెలియజేశారు. విద్యార్థులు,సీనియర్‌ సిటిజన్లు,సాయుధ దళాల సిబ్బందికి ప్రస్తుతం అమలులో ఉన్న ప్రత్యేక రాయితీలు యథాతథంగా కొనసాగుతాయని ఎయిరిండియా స్పష్టం చేసింది.

వివరాలు 

8 శాతం క్షీణించిన ఇండిగో షేరు 

విమానాల రద్దులు, భారీగా రిఫండ్‌ చెల్లింపుల కారణంగా ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు సోమవారం బీఎస్‌ఈలో 8.28 శాతం నష్టంతో రూ.4,926.55 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో ఈ షేరు రూ.4,842.20 స్థాయికి పడిపోయింది. గత ఆరు వ్యాపార దినాల్లో మొత్తం 16.4 శాతం నష్టం వాటిల్లగా, కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు రూ.37,000 కోట్ల వరకు తగ్గిందని సమాచారం.

Advertisement