Indian Rupee: డాలర్‌పై రూపాయి జోరు.. ఒక్కరోజే 47 పైసలు లాభం
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ గణనీయంగా పుంజుకుంది. గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే రూపాయి 47 పైసలు బలపడి 94.26 స్థాయికి చేరింది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి రూపాయి మారకం విలువ 94.97గా నమోదైంది.
వివరాలు
విదేశీ నిధుల భారీ ప్రవాహం..
రూపాయి బలోపేతం కావడానికి ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకొచ్చిన ప్రత్యేక పథకాల ద్వారా దేశంలోకి పెద్ద మొత్తంలో విదేశీ నిధులు రావడం కారణంగా కనిపిస్తోంది.
విదేశీ కరెన్సీ సమీకరణ పథకాల ద్వారా భారత్‌కు 136.38బిలియన్ డాలర్ల నిధులు వచ్చినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
మార్కెట్ వర్గాలు దాదాపు 100బిలియన్ డాలర్ల మేర విదేశీ నిధులు వస్తాయని అంచనా వేసినప్పటికీ.. వాస్తవంగా అంతకంటే ఎక్కువగా నిధులు సమకూరాయి.
దీంతో రూపాయికి గణనీయమైన మద్దతు లభించింది. ఈ నిధుల్లో అధిక భాగం ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్(ఎఫ్‌సీఎన్‌ఆర్)డిపాజిట్ల రూపంలో వచ్చినట్లు తెలుస్తోంది.
వీటితో పాటు ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ద్వారా 3.89బిలియన్ డాలర్లు,ఓవర్సీస్ ఫారిన్ కరెన్సీ బారోయింగ్స్ ద్వారా మరో 5.26బిలియన్ డాలర్లు సమకూరాయి.
వివరాలు
డాలర్‌పై పెరిగిన ఒత్తిడి..
భారత రూపాయికి దేశీయ పరిణామాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా అనుకూలంగా మారాయి.
ఇతర ఆసియా కరెన్సీలు బలపడటం, యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.50 స్థాయికి దిగువనకు పడిపోవడం రూపాయికి సానుకూలంగా మారాయి.
ముఖ్యంగా జపాన్ యెన్ పుంజుకోవడంతో డాలర్‌పై మరింత ఒత్తిడి పెరిగింది.
ఫెడ్ నిర్ణయంపై మార్కెట్ దృష్టి..
ఈ నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్‌లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రానున్న అమెరికా ఆర్థిక గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ అధికారులు చేసే ప్రకటనలను ఇన్వెస్టర్లు, మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
వివరాలు
రూపాయికి స్థిరత్వం ఉంటుందా?
అంచనాలను మించి వచ్చిన విదేశీ నిధులు, ఆర్‌బీఐ అందిస్తున్న మద్దతు, అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల పరిస్థితులు రూపాయికి అనుకూలంగా మారుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో సమీప కాలంలో భారత రూపాయి బలమైన స్థితిలో కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.