State Bank of India: SBI రుణ వడ్డీ రేట్లు పెంపు.. గృహ, వాహన రుణాల ఈఎంఐలు పెరిగే ఛాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రుణ వడ్డీ రేట్లను పెంచింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రేట్ (EBLR),రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR),మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ల్లో ఎంపిక చేసిన కాలవ్యవధులకు సవరణలు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ఇటీవల రెపో రేటును 25బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా సవరణలతో ఎంసీఎల్ఆర్,ఈబీఎల్ఆర్,ఆర్ఎల్ఎల్ఆర్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీ భారం పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా రుణాలు తీసుకున్నవారు అధిక ఈఎంఐలు చెల్లించాల్సి రావచ్చు. పెంచిన వడ్డీ రేట్లు అక్టోబర్ 15, 2026 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.
వివరాలు
మూడు నెలల ఎంసీఎల్ఆర్ను 8.75 శాతానికి పెంచింది
ఈబీఎల్ఆర్ను 7.90 శాతం నుంచి 8.15 శాతానికి పెంచింది. దీనికి క్రెడిట్ రిస్క్ ప్రీమియం (CRP), బ్యాంక్ స్ప్రెడ్ (BSP) అదనంగా వర్తిస్తాయి.
అలాగే రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR)ను 7.50 శాతం నుంచి 7.75 శాతానికి సవరించింది.
ఈ రేట్లతో అనుసంధానమైన గృహ రుణాలు, వాహన రుణాలపై వడ్డీ పెరిగే అవకాశం ఉంది.
దీంతో రుణ గ్రహీతలు చెల్లించే నెలవారీ వాయిదాలపై ప్రభావం పడవచ్చు.
మరోవైపు,ఓవర్నైట్, ఒక నెల కాలవ్యవధి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ల్లో ఎస్బీఐ ఎలాంటి మార్పు చేయలేదు.
ఈ రేట్లను 7.85 శాతం వద్దే కొనసాగించింది. అయితే మూడు నెలల ఎంసీఎల్ఆర్ను 8.60 శాతం నుంచి 8.75 శాతానికి పెంచింది.
వివరాలు
మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.95 శాతానికి..
ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ను 8.70 శాతం నుంచి 8.85 శాతానికి సవరించింది.
రెండేళ్లు, మూడేళ్ల కాలవ్యవధులకు సంబంధించిన ఎంసీఎల్ఆర్లను కూడా 15 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచింది.
దీంతో రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.90 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.95 శాతానికి చేరాయి.
వివరాలు
ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి?
ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేటును నిర్ణయించడానికి ఉపయోగించే విధానం.
బ్యాంకు నిధుల సమీకరణ వ్యయం, నిర్వహణ ఖర్చులు, లాభాల మార్జిన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రేటును నిర్ణయిస్తారు.
సాధారణంగా పాత గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, కార్పొరేట్ రుణాల్లో చాలా వరకు ఎంసీఎల్ఆర్తో అనుసంధానమై ఉంటాయి.
ఈ రేటులో మార్పులు చోటుచేసుకున్నప్పుడు ఆయా రుణాల వడ్డీ రేట్లు, రుణ కాలవ్యవధి లేదా ఈఎంఐలపై ప్రభావం పడవచ్చు.