Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల మధ్య ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్పష్టత లేని సంకేతాలు రావడం, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు కొనసాగడం, టారిఫ్‌లపై ఆందోళనలు నెలకొనడం, అదే సమయంలో మదుపర్లు లాభాలు తీసుకోవడంతో మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా కన్జూమర్ డ్యూరబుల్స్, రియల్టీ రంగాల షేర్లలో భారీ అమ్మకాలు జరగడంతో సూచీలు కిందకు జారాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఒక దశలో దాదాపు 600 పాయింట్ల వరకు పడిపోగా, నిఫ్టీ 25,603 స్థాయిని ఇంట్రాడే కనిష్ఠంగా నమోదు చేసింది.
వివరాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.21గా నమోదు
చివరికి సెన్సెక్స్ 250.48 పాయింట్లు నష్టపోయి 83,627.69 వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ 57.95 పాయింట్లు తగ్గి 25,732.30 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 షేర్లలో ట్రెంట్, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్, ఇండిగో, మారుతీ షేర్లు ప్రధానంగా నష్టాలను చవిచూశాయి. మరోవైపు ఎటెర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, టీసీఎస్ షేర్లు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 64.91 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,582.93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.21గా ఉంది.