Stock market: ఉదయం లాభాలు.. చివర్లో నష్టాలు.. నాలుగో రోజూ కుదేలైన దేశీయ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. దీంతో ఉదయం లాభాలతో మొదలైన సూచీలు.. ట్రేడింగ్ చివరి గంటలో ఎదురైన అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా షేర్లు సుమారు 2 శాతం వరకు పడిపోవడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఫలితంగా వరుసగా నాలుగో సెషన్‌లోనూ సూచీలకు నష్టాలు తప్పలేదు.
వివరాలు
సెన్సెక్స్ ఇలా..
బీఎస్‌ఈ సెన్సెక్స్ గత ముగింపు 76,570.35తో పోలిస్తే 76,724.95 వద్ద లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించింది.
రోజంతా ఎక్కువగా లాభాల్లోనే కదలాడిన సూచీ.. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఇంట్రాడేలో 76,152.86 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.
చివరికి 417.49 పాయింట్లు నష్టపోయి 76,152.86 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ కూడా నష్టాల్లోనే..
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా రోజును నష్టాలతో ముగించింది. సూచీ 41 పాయింట్లు కోల్పోయి 23,873.45 వద్ద ముగిసింది.
వివరాలు
ఈ షేర్లపై ప్రభావం
సెన్సెక్స్-30లో టైటాన్, ట్రెంట్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ప్రధానంగా నష్టాలను చవిచూశాయి.
మరోవైపు యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, బీఈఎల్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
చమురు, బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 96.87 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారం ఔన్స్ ధర 4,427.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
పశ్చిమాసియా పరిణామాలు, చమురు ధరల కదలికలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.