Loading...
Stock Market: నాలుగో రోజూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు.. 570 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
570 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

Stock Market: నాలుగో రోజూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు.. 570 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 01, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. గురువారం కూడా సూచీలు నష్టాలతో ముగిశాయి. దీంతో వరుసగా నాలుగో సెషన్‌లోనూ మార్కెట్లు క్షీణించాయి. విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs) భారీగా షేర్లను విక్రయించడం, అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎగబాకడం వంటి పరిణామాలు భారత ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి. రోజు ప్రారంభం నుంచి మార్కెట్‌లో అస్థిరత కనిపించింది.మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఒక్కసారిగా పెరగడంతో సెన్సెక్స్‌ దాదాపు 1,200 పాయింట్ల మేర క్షీణించింది. అయితే చివరి దశలో కనిష్ఠ స్థాయిల వద్ద మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీ కొంత కోలుకుంది.

వివరాలు 

570.59 పాయింట్ల నష్టంతో ముగిసింది

దాదాపు 600 పాయింట్ల వరకు రికవరీ కావడంతో నష్టాలు కొంత తగ్గాయి. నిఫ్టీ కూడా దాదాపు 200 పాయింట్లు కోల్పోయి 22,400 స్థాయికి కొద్దిగా పైన స్థిరపడింది.

సెన్సెక్స్‌ ఉదయం 72,192.89 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది.

అంతకుముందు సెషన్‌లో ఇది 72,480.29 పాయింట్ల వద్ద ముగిసింది.

ప్రారంభ ట్రేడింగ్‌లో సూచీ ఒక మోస్తరు పరిధిలో కదలాడినా.. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల వెల్లువతో భారీగా పడిపోయింది.

ఇంట్రాడేలో 71,292.88 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

ఆ తర్వాత కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్లు పెరగడంతో తిరిగి పుంజుకుంది. చివరకు 570.59 పాయింట్ల నష్టంతో 71,909.70 వద్ద ముగిసింది.

వివరాలు 

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా బలహీనపడింది

నిఫ్టీ విషయానికి వస్తే.. సూచీ 198.50 పాయింట్లు నష్టపోయి 22,421.95 వద్ద స్థిరపడింది.

మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా బలహీనపడింది.

దాదాపు 37 పైసలు క్షీణించిన రూపాయి.. 96.31 వద్ద ముగిసింది. షేర్ల విషయానికి వస్తే.. సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ షేర్లు ప్రధానంగా నష్టాలను చవిచూశాయి.

మరోవైపు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.

అంతర్జాతీయ మార్కెట్లలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది. మరోవైపు బంగారం ధర ఔన్సుకు 4,162 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

ఎఫ్‌ఐఐల భారీ విక్రయాలు

చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగడం దిగుమతులపై ఆధారపడే భారత మార్కెట్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తోంది.

దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు నిధులను వెనక్కి తీసుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

బుధవారం ఒక్కరోజే విదేశీ సంస్థాగత మదుపరులు దాదాపు రూ.10,148 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీ షేర్లను విక్రయించారు.

అంతకుముందు మంగళవారం కూడా సుమారు రూ.10 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.

ఈ వారంలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడుల నుంచి దాదాపు రూ.26 వేల కోట్ల మేర నిధులు బయటకు వెళ్లినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా బాండ్‌ రాబడులు పెరగడం మరో కారణం

అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు గణనీయంగా పెరగడం కూడా భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది.

అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి 5.33 శాతానికి చేరింది. 2007 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

అదే సమయంలో 30 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి 5.65 శాతానికి చేరింది. ఇది 2002 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి.

అమెరికా బాండ్లపై అధిక రాబడులు కనిపించడంతో అంతర్జాతీయ మదుపరులు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

వివరాలు 

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం

పశ్చిమాసియాలో పరిస్థితులు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.

ఇరాన్‌పై మరోసారి దాడి చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఆందోళనలకు కారణమయ్యాయి.

తన ముందున్న మార్గాల్లో ఒకటి ఒప్పందం చేసుకోవడం కాగా,మరో మార్గం ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేయడమేనని ఆయన స్థానిక విలేకరులతో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

పరిస్థితులు మరింత తీవ్రతరం కావచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తిరిగి పెరిగాయి.

క్రూడాయిల్‌ ధరల పెరుగుదల భారతదేశం వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతోంది.

ఈ పరిణామాలన్నీ కలిసిరావడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ నష్టాలను నమోదు చేశాయి.

ADVERTISEMENT