Loading...
Stock Market: వరుసగా ఆరో రోజు లాభాలు.. 24,500 మార్క్‌ దాటిన నిఫ్టీ

Stock Market: వరుసగా ఆరో రోజు లాభాలు.. 24,500 మార్క్‌ దాటిన నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. అమెరికా ఎన్నికల ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు సూచీలకు ఊతమిస్తున్నాయి. వరుసగా ఆరో రోజు మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం మదుపర్లలో ఉత్సాహాన్ని పెంచింది. దీంతో గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1.45 గంటల సమయానికి సెన్సెక్స్‌ 2,024 పాయింట్లు పెరిగి 79,326 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 578 పాయింట్లు లాభపడి 24,538 వద్ద కొనసాగుతోంది. ఫార్మా రంగాన్ని మినహాయిస్తే దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. ఆటోమొబైల్‌ రంగ సూచీ 2.5 శాతం ఎగబాకింది.

వివరాలు 

ర్యాలీకి కారణాలివే..

నిఫ్టీలో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతి సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి.

మరోవైపు రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సిప్లా, కోల్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికల ఫలితాలు అక్కడి స్టాక్‌ మార్కెట్లకు ఊతమిచ్చాయి. వాల్‌స్ట్రీట్‌లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో డోజోన్స్‌ సూచీ 1,500 పాయింట్లకు పైగా పెరిగింది.

ఎస్‌అండ్‌పీ 500 సూచీ 1.58 శాతం, నాస్‌డాక్‌ 1.44 శాతం లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లలో ఈ సానుకూల పరిస్థితులు భారతీయ మార్కెట్లపైనా ప్రభావం చూపాయి.

వివరాలు 

ర్యాలీకి కారణాలివే..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలున్నాయన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా దిగివచ్చాయి.

బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 93.5 డాలర్లకు పడిపోయి రెండు నెలల కనిష్ఠ స్థాయిని తాకింది. చమురు ధరల తగ్గుదల దేశీయ మార్కెట్లకు మరింత బలాన్నిచ్చింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా బలపడింది. గురువారం ట్రేడింగ్‌లో రూపాయి 14 పైసలు పెరిగి 94.32 వద్ద కొనసాగుతోంది.

దీనికి తోడు విదేశీ సంస్థాగత మదుపర్లు వరుసగా నాలుగో రోజు భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు.

బుధవారం ఒక్కరోజే రూ.7,284 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. 2025 అక్టోబరు తర్వాత ఒకే రోజులో ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి.

ADVERTISEMENT