Loading...
Stock Market: భారీ లాభాలతో ముగిసిన సూచీలు.. 879 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
భారీ లాభాలతో ముగిసిన సూచీలు.. 879పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Stock Market: భారీ లాభాలతో ముగిసిన సూచీలు.. 879 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2026
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం, టీసీఎస్‌ సహా ఇతర ఐటీ కంపెనీల షేర్లు రాణించడం మార్కెట్‌కు అండగా నిలిచాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌పై దాడులు ఉంటాయని పేర్కొనడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడం కూడా సూచీలకు కలిసొచ్చాయి. ఈ పరిణామాలతో సెన్సెక్స్‌ 800 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 22,500 పాయింట్ల స్థాయిని దాటింది.

వివరాలు 

సెన్సెక్స్‌ 879 పాయింట్లు అప్

శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ క్రితం ముగింపు 71,593.24 పాయింట్లతో పోలిస్తే 71,776.67 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది.

ట్రేడింగ్‌ ఆద్యంతం సూచీ లాభాల్లోనే కొనసాగింది. ఒక దశలో 1,000 పాయింట్లకు పైగా పెరిగి 72,669.20 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది.

చివరకు 879.09 పాయింట్ల లాభంతో 72,472.33 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ 288.65 పాయింట్లు పెరిగి 22,520.45 వద్ద ముగిసింది.

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.72గా నమోదైంది.

వివరాలు 

ఐటీ షేర్లలో కొనుగోళ్ల సందడి

సెన్సెక్స్‌-30లో రిలయన్స్‌ మినహా మిగిలిన కంపెనీల షేర్లు లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీసీ, టీసీఎస్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఐటీ రంగ షేర్లలో వచ్చిన లాభాలు మార్కెట్‌ పెరుగుదలకు తోడ్పడ్డాయి.

102 డాలర్ల వద్ద బ్రెంట్‌ క్రూడ్‌

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 102 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, అంతర్జాతీయ విపణిలో బంగారం ఔన్సు ధర 4,184 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ADVERTISEMENT