Stock Market: మార్కెట్‌కు జోష్ తెచ్చిన ఈయూ ప్రకటన.. గ్రీన్‌లో కొనసాగుతున్న అన్ని రంగాలు
ఈ వార్తాకథనం ఏంటి
హమ్మయ్య! దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ తేరుకుంది. కొన్ని రోజులుగా గ్రీన్‌లాండ్ వివాదం, అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులు కారణంగా మార్కెట్ తీవ్ర స్థితిలో కొనసాగుతూ, ఈ వారం ప్రారంభం నుంచే భారీ నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల రూపాయల సంపద క్షీణించగా, ఇన్వెస్టర్లను గందరగోళంలోకి నెట్టింది. కానీ, తాజాగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా లేయెన్ చేసిన ప్రకటన మార్కెట్‌లో సానుకూల వాతావరణం సృష్టించింది. భారత్‌తో వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందన్న సూచన ఇచ్చిన వెంటనే మార్కెట్ జోష్‌లోకి వచ్చింది. గురువారం స్టాక్ మార్కెట్ ప్రారంభం నుండి భారీ లాభాలతో దూసుకెళ్తోంది. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి.
వివరాలు
నిఫ్టీ @25,398
ప్రస్తుతం సెన్సెక్స్ 755 పాయింట్ల లాభంతో 82,683 వద్ద నిలిచగా, నిఫ్టీ 241 పాయింట్ల లాభంతో 25,398 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో ఎటర్నల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఆసియన్ పెయింట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రధాన లాభాలను సాధించగా, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, మాక్స్ హెల్త్‌కేర్, ఎన్‌టిపిసి నష్టపోయాయి. ఇంకా, దావోస్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా త్వరలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం పూర్తి అవుతుందంటూ సానుకూల ప్రకటన చేశారు. ఈ వార్త కూడా మార్కెట్‌కు మద్దతుగా పనిచేసి, గత కొన్ని రోజులుగా పతన దిశలో ఉన్న సూచీలు ఇప్పుడు భారీ లాభాలతో ఊగిపోతున్నాయి.