LOADING...
Meta Layoff: తామే తయారు చేసిన ఏఐతో ఉద్యోగాలు కోల్పోయిన మెటా సిబ్బంది
తామే తయారు చేసిన ఏఐతో ఉద్యోగాలు కోల్పోయిన మెటా సిబ్బంది

Meta Layoff: తామే తయారు చేసిన ఏఐతో ఉద్యోగాలు కోల్పోయిన మెటా సిబ్బంది

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫేస్‌ బుక్‌ మాతృసంస్థ మెటా చేపట్టిన ఉద్యోగుల తొలగింపులపై కొత్త చర్చ మొదలైంది. సంస్థలో పనిచేసిన ఉద్యోగులు తయారుచేసిన కృత్రిమ మేధ సాధనాలను తరువాత వారి స్థానాల్లో వినియోగించారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని ఉద్యోగం కోల్పోయిన ఓ మహిళ భర్త సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో వెల్లడించడం ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీసింది. జూలియన్‌ అనే వ్యక్తి చేసిన పోస్టు ప్రకారం.. కొన్ని నెలల క్రితం మెటా సంస్థలో ప్రత్యేకంగా 'ఏఐ వీక్‌' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో ఉద్యోగులు తమ సాధారణ పనులను పక్కనపెట్టి సంస్థ అంతర్గత అవసరాలకు ఉపయోగపడే కృత్రిమ మేధ సాధనాల రూపకల్పనపై దృష్టి పెట్టాలని యాజమాన్యం సూచించినట్లు తెలిపారు.

వివరాలు 

ప్రాజెక్టులో జూలియన్‌ భార్య

ఉద్యోగులు రూపొందించిన అనేక సాధనాల్లో కొన్నింటిని ఎంపిక చేసి వాటిని మరింత అభివృద్ధి చేయాలని సంస్థ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో తన భార్య కూడా భాగస్వామ్యమైనట్లు జూలియన్‌ తెలిపారు. తాము రూపొందిస్తున్న సాధనాలే భవిష్యత్తులో తమ ఉద్యోగాలను ప్రమాదంలోకి నెట్టవచ్చన్న ఆందోళన ఆమెకు అప్పటినుంచే ఉండేదన్నారు. సీనియర్‌ ఇంజినీర్లతో కలిసి ఒక కృత్రిమ మేధ సాధనాన్ని అభివృద్ధి చేయడానికి ఆమె నెలల తరబడి శ్రమించిందని చెప్పారు. అయితే తాజాగా మెటా ప్రకటించిన ఉద్యోగుల తొలగింపుల్లో ఆమె కూడా ఉద్యోగం కోల్పోయినట్లు వెల్లడించారు.

వివరాలు 

మెటా సంస్థలో ఉద్యోగం కోల్పోయిన మరో మహిళ

అయితే ఉద్యోగుల చేత రూపొందించిన ఈ సాధనాలను వారి స్థానాల్లో వినియోగిస్తున్నారన్న అంశంపై మెటా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్‌ అవుతోంది. కృత్రిమ మేధ ప్రభావంతో భవిష్యత్తులో కార్యాలయ ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉండబోతుందన్న చర్చకు ఇది మరింత ఊతమిచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. మెటా సంస్థలో ఉద్యోగం కోల్పోయిన మరో మహిళ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఆశా రావల్‌ అనే మహిళ 2022 నుంచి మెటాలో ఉత్పత్తి రూపకర్తగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉద్యోగుల తొలగింపుల్లో ఆమె కూడా బాధితురాలయ్యారు.

Advertisement

వివరాలు 

సంతోషంగా ఉంది..

అయితే ఉద్యోగం కోల్పోయినందుకు తాను బాధపడటం లేదని ఆశా రావల్‌ తెలిపారు. పైగా ఇప్పుడు తాను ఎంతో సంతోషంగా, స్వేచ్ఛగా అనిపిస్తోందని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

Advertisement