LOADING...
Silver ETFs: వెండి ధరల షాక్‌.. మళ్లీ కుప్పకూలిన సిల్వర్‌ ఈటీఎఫ్‌లు
వెండి ధరల షాక్‌.. మళ్లీ కుప్పకూలిన సిల్వర్‌ ఈటీఎఫ్‌లు

Silver ETFs: వెండి ధరల షాక్‌.. మళ్లీ కుప్పకూలిన సిల్వర్‌ ఈటీఎఫ్‌లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2026
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా క్షీణించడంతో సిల్వర్‌ ఈటీఎఫ్‌ల పతనం కొనసాగుతోంది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా తీవ్రంగా కనిపిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే సిల్వర్‌ ఈటీఎఫ్‌లు దాదాపు 20 శాతం వరకు పడిపోగా, సోమవారం మరో 19 శాతం మేర నష్టపోయాయి. ఇటీవలి కాలంలో రిటైల్‌ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు ఇచ్చిన ఈటీఎఫ్‌లు ఒక్కసారిగా కుదేలవడంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. దేశీయ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌ (MCX)లో కిలో వెండి మార్చి కాంట్రాక్టు ధర ప్రస్తుతం రూ.2.27 లక్షల వద్ద కొనసాగుతోంది. గత గురువారం మాత్రం వెండి ధర రూ.4,20,048 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

Details

దాదాపు రూ.2లక్షలు తగ్గిన వెండి

ఆ గరిష్ఠంతో పోలిస్తే ప్రస్తుతం కిలో వెండి ధర దాదాపు రూ.2 లక్షల వరకు తగ్గింది. ఈ భారీ పతనమే సిల్వర్‌ ఈటీఎఫ్‌లపై నేరుగా ప్రభావం చూపింది. వివిధ ఫండ్‌ హౌసుల సిల్వర్‌ ఈటీఎఫ్‌లు గణనీయంగా నష్టపోయాయి. టాటా సిల్వర్‌ ఈటీఎఫ్‌ 19.15 శాతం, ఎస్‌బీఐ సిల్వర్‌ ఈటీఎఫ్‌ 14.98 శాతం, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ 14.6 శాతం మేర పడిపోయాయి. అలాగే గ్రో సిల్వర్‌ ఈటీఎఫ్‌ 16.17 శాతం, జెరోధా సిల్వర్‌ ఈటీఎఫ్‌ 15.41 శాతం, నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఎఫ్‌ 15.69 శాతం నష్టపోయాయి.

Details

మోతీలాల్‌ ఓస్వాల్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ 16.02 శాతం మేర పతనం

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ 14.05 శాతం, కోటక్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ 17.38 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ సిల్వర్‌ ఈటీఎఫ్‌ 16.65 శాతం, మోతీలాల్‌ ఓస్వాల్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ 16.02 శాతం మేర పతనమయ్యాయి. డాలర్‌ బలపడటం, అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం, అదే సమయంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు వెళ్లడం వంటి కారణాలతో వెండి ధరలు ఒత్తిడికి లోనవుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టిన మదుపర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement