Page Loader
భారత మార్కెట్‌లో పట్టు సాధించేందుకు స్టార్‌బక్స్ కొత్త వ్యూహం 
భారత మార్కెట్‌లో పట్టు సాధించేందుకు స్టార్‌బక్స్ కొత్త వ్యూహం

భారత మార్కెట్‌లో పట్టు సాధించేందుకు స్టార్‌బక్స్ కొత్త వ్యూహం 

వ్రాసిన వారు Stalin
Jun 07, 2023
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన విదేశీ కాఫీ బ్రాండ్లలో స్టార్‌బక్స్ ఒకటి. భారత మార్కెట్‌లో స్టార్‌బక్స్ దేశీయ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. థర్డ్ వేవ్ కాఫీ, బ్లూ టోకాయ్ వంటి వాటితో సహా భారతదేశంలోని దేశీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి అమెరికాకు చెందిన స్టార్‌బక్స్ సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. టాటా గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌లో భారతదేశంలో పనిచేస్తున్న స్టార్‌బక్స్ అమ్మకాలను మరింత పెంచేందుకు కార్యకలాపాలను చిన్న పట్టణాలకు విస్తరించాలని భావిస్తోంది. నగరాలు, పెద్ద పట్టణాల్లో తీవ్రమైన ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ ఉన్నందున చౌకైన పానీయాలతో చిన్న పట్టణాల్లోకి చొచ్చుకుపోవాలని స్టార్‌బక్స్ భావిస్తోంది. తద్వారా పిల్లలతో సహా భారతీయులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

కాఫీ

కస్టమర్‌లను ఆకర్షించడానికి తక్కువ రేటుతో పానీయాలు

'టీ'ని అమితంగా ఇష్టపడే భారత మార్కెట్‌లోకి ప్రవేశించిన మొదటి విదేశీ కాఫీ బ్రాండ్‌ స్టార్‌బక్స్. ఇది గత 11 ఏళ్లలో 343 స్టోర్‌లను తెరిచింది. దీని పోటీ కంపెనీలైన థర్డ్ వేవ్ కాఫీ, బ్లూ టోకాయ్ గత మూడేళ్లలోనే 150 ప్రారంభించాయి. కొత్త ఔట్ లెట్లు తెరుస్తున్న కొద్ది, కొత్త వినియోగదారులను పొందొచ్చని భారతదేశంలోని స్టార్‌బక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుశాంత్ డాష్ అన్నారు. దేశంలో కార్యకలాపాలను విస్తరించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి తక్కువ రేటుతో పానీయాలను కూడా స్టార్‌బక్స్ పరిచయం చేసింది. ఈ ఆఫర్లు భారతదేశం కోసం మాత్రమే అని, చైనా, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్‌లో కూడా అందుబాటులో లేవని గమనించవచ్చు.

కాఫీ

టీ కంటే కాఫీ పైనే ఫోకస్

టాటా గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌లో భారతదేశంలో పనిచేస్తున్న స్టార్‌బక్స్ 2022/23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 132 మిలియన్ డాలర్ల రెవెన్యూను పొందింది. భారతదేశంలో ఇప్పటికీ స్టార్‌బక్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, దిల్లీ, టెక్నాలజీ హబ్ బెంగుళూరులో మాత్రం స్టార్‌బక్స్ తీవ్రమైన పోటీ ఉంటుంది. భారతదేశంలో 91% మంది టీ తాగితే, కేవలం 11% భారతీయ ఇళ్లలో మాత్రమే కాఫీ తాగుతున్నారని అంచనా వేసింది. అందుకే సుగంధ ద్రవ్యాలు, ఏలకులతో కలిపిన "భారతీయ-ప్రేరేపిత" టీ ఉత్పత్తులను ప్రారంభించింది. కాఫీ తాగని, స్టార్‌బక్స్‌కు దూరంగా ఉండేవారిని ఆకర్షించడానికి ఈ పానీయాలు ఉపయోగపడుతాయని కంపెనీ భావిస్తోంది. తమ కంపెనీ టీ కంటే కాఫీ పైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తుందని స్టార్‌బక్స్ చెప్పింది.