Stock Market Crash: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ₹9 లక్షల కోట్లు ఆవిరి
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలలో ముగిశాయి. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. ఒక దశలో సెన్సెక్స్ 1200 పాయింట్లకుపైగా పడిపోగా, నిఫ్టీ 25,200 దిగువకు చేరింది. చివర్లో కొంత మేర కోలుకున్నప్పటికీ, సూచీలు రెండు నెలల కనిష్ఠ స్థాయిల వద్దనే ముగిశాయి. ఈ పరిణామాలతో ఒక్కరోజులోనే మదుపర్ల సంపద సుమారు రూ.9 లక్షల కోట్ల మేర తగ్గింది.
వివరాలు
డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.97గా నమోదు
ఉదయం సెన్సెక్స్ 83,207.38 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 83,246.18) నష్టాలతో ప్రారంభమైంది. సెషన్ మొత్తం నెగటివ్ ట్రెండ్‌లోనే కదిలిన సూచీ, ఇంట్రాడేలో 82,010.58 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1,065.71 పాయింట్లు కోల్పోయి 82,180.47 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 353 పాయింట్లు తగ్గి 25,232.50 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.97గా నమోదైంది. సెన్సెక్స్ 30 షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక్కటే లాభాల్లో నిలవగా, మిగిలిన అన్ని షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎటెర్నల్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఇండిగో, ట్రెంట్ వంటి షేర్లు గణనీయంగా పడిపోయాయి.