Loading...
Stock Market: ఒడిదుడుకుల మధ్య ముగిసిన స్టాక్‌ మార్కెట్‌.. చివర్లో పుంజుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ
చివర్లో పుంజుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market: ఒడిదుడుకుల మధ్య ముగిసిన స్టాక్‌ మార్కెట్‌.. చివర్లో పుంజుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎగసిపడటంతో సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే చివరి సెషన్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్‌ 76,963.35 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. గత ముగింపు 77,569.39 పాయింట్లతో పోలిస్తే ప్రారంభంలోనే ఒత్తిడి కనిపించింది. రోజంతా హెచ్చుతగ్గుల మధ్య ట్రేడైన సెన్సెక్స్‌ చివరికి 47.01 పాయింట్లు పెరిగి 77,616.40 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 4.10 పాయింట్లు లాభపడి 24,211.00 పాయింట్ల వద్ద స్థిరపడింది.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 78.11 డాలర్లు 

సెన్సెక్స్‌లోని 30 ప్రధాన కంపెనీల్లో టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

మరోవైపు టాటా స్టీల్‌, ఎటర్నల్‌, ఇండిగో, మారుతీ సుజుకి, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ (బీఈఎల్‌) షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

విదేశీ మారక మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95.62 వద్ద కొనసాగింది.

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 78.11 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 4,067 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ADVERTISEMENT