LOADING...
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 12, 2026
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా టారిఫ్‌లపై నెలకొన్న ఆందోళనలు, విదేశీ పెట్టుబడిదారుల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఉదయం తీవ్ర నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 700 పాయింట్లకుపైగా పడిపోగా, నిఫ్టీ 25,500 దిగువకు జారింది. అయితే, అనూహ్యంగా మార్కెట్‌ దిశ మారింది. గంట వ్యవధిలోనే సూచీలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టాయి. ఈ మార్పుకు ప్రధాన కారణంగా భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ చేసిన వ్యాఖ్యలు నిలిచాయి. సోమవారం అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన చేసిన ప్రకటనలు మార్కెట్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి.

వివరాలు 

నష్టాల పరంపరకు బ్రేక్‌ 

భారత్‌-అమెరికా దేశాలు కీలక భాగస్వాములని సెర్గియో గోర్‌ స్పష్టం చేశారు. మిత్రదేశాల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు సహజమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 13న ఇరు దేశాల మధ్య తదుపరి దశ వాణిజ్య చర్చలు జరగనున్నట్లు ఆయన చేసిన ప్రకటన మార్కెట్‌ సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. అంతేకాదు, సిలికాన్‌ సరఫరా కోసం అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన వ్యూహాత్మక ప్యాక్స్‌సిలికాన్‌ కూటమిలో భారత్‌ను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించడం కూడా సానుకూల ప్రభావం చూపింది. ఫలితంగా ఐదు రోజులుగా కొనసాగుతున్న నష్టాల పరంపరకు బ్రేక్‌ పడింది. కనిష్ఠ స్థాయిల నుంచి సెన్సెక్స్‌ దాదాపు 1,100 పాయింట్ల మేర రికవరీ సాధించింది.

వివరాలు 

సెర్గియో గోర్‌ వ్యాఖ్యల ప్రభావం

సూచీల కదలికలను పరిశీలిస్తే.. సెన్సెక్స్‌ 83,576.24 పాయింట్ల వద్ద ముగిసిన గత సెషన్‌ తర్వాత, సోమవారం ఉదయం 83,435.31 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,861.07 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం సెర్గియో గోర్‌ వ్యాఖ్యల ప్రభావంతో లాభాల బాట పట్టి, 83,962.33 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 301.93 పాయింట్ల లాభంతో 83,878.17 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 25,473.40 వద్ద కనిష్ఠాన్ని తాకిన తర్వాత పుంజుకుని, ఇంట్రాడేలో 25,813.15 వరకు ఎగబాకింది. సెషన్‌ ముగిసే సరికి 106.95 పాయింట్ల లాభంతో 25,790.25 వద్ద స్థిరపడింది.

Advertisement

వివరాలు 

 డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.16గా నమోదు 

విదేశీ మారక మార్కెట్లో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.16గా నమోదైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ట్రెంట్‌, ఎస్‌బీఐ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు లాభాల జాబితాలో నిలిచాయి. మరోవైపు ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బీఈఎల్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 63.02 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర రికార్డు స్థాయిలో 4,589 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Advertisement