Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, అంతేకాకుండా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రారంభ సెషన్‌లోనే పెట్టుబడిదారులు అమ్మకాల వైపు మొగ్గు చూపడంతో సూచీలు గణనీయంగా క్షీణించాయి. ఉదయం 9.31 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 605 పాయింట్లు పడిపోయి 76,964 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 177 పాయింట్లు నష్టపోయి 24,029 స్థాయిలో కొనసాగుతోంది. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ 24 వేల మార్క్ సమీపంలో హెచ్చుతగ్గులకు లోనవుతోంది.
వివరాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.72 గా నమోదు
సెక్టార్ల వారీగా చూస్తే టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా షేర్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.72 వద్ద ప్రారంభమైంది.
వివరాలు
మళ్లీ భగ్గుమంటున్న పశ్చిమాసియా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)దాడి చేసిన ఘటనలో భారతీయ సిబ్బందిలో ఒకరు గల్లంతైనట్లు సమాచారం. ఈ ఘటనకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌పై చర్యలు చేపట్టగా, దానికి ప్రతిగా టెహ్రాన్ బహ్రెయిన్, కువైట్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను మరోసారి లక్ష్యంగా చేసుకుంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీశాయి.ఈ భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ చమురుధర ఒకేరోజులో సుమారు 4శాతం పెరిగి బ్యారెల్‌కు 79.26డాలర్లకు చేరుకుంది. చమురు ధరల పెరుగుదలతో పాటు ప్రపంచ ఆర్థికఅనిశ్చితి కూడా ఈక్విటీ మార్కెట్లపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తోంది.