Loading...
Sunil Bharti Mittal: సునీల్ భారతీ మిట్టల్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
సునీల్ భారతీ మిట్టల్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

Sunil Bharti Mittal: సునీల్ భారతీ మిట్టల్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2026
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లభించనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆయనకు 'షెవాలియర్ డి లోర్డ్రె నేషనల్ డి లా లెజియన్ డి హానర్' (నైట్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్) పురస్కారాన్ని ప్రకటించారు. 1802లో నెపోలియన్ బోనపార్టే ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. భారత్‌-ఫ్రాన్స్ మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి మిట్టల్ చేసిన కృషితో పాటు టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.

వివరాలు 

మిట్టల్‌ కృషిని గుర్తించిన ఫ్రాన్స్‌.. భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాల బలోపేతానికి తోడ్పాటు

ఎయిర్‌టెల్‌ ప్రారంభమైన 1992 నుంచి సునీల్ భారతీ మిట్టల్‌కు ఫ్రాన్స్‌తో సుదీర్ఘ అనుబంధం ఉందని భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి థియరీ మాథౌ పేర్కొన్నారు.

దశాబ్దాలుగా ఈ సంబంధాలను మిట్టల్‌ ఎంతో పట్టుదలతో కొనసాగించారని, ఫ్రాన్స్‌, భారత్‌కు చెందిన వ్యాపార సంస్థలు కలిసి పనిచేస్తే ఎలాంటి విజయాలు సాధించవచ్చో ఆయన నిరూపించారని తెలిపారు.

ప్రస్తుతం యూటెల్‌శాట్‌ సంస్థ వైస్‌ ఛైర్మన్‌గా మిట్టల్‌ వ్యవహరిస్తున్నారని గుర్తుచేశారు.

ఈ బాధ్యత ద్వారా అంతరిక్షం, డిజిటల్‌ సాంకేతిక రంగాల్లో భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలు మరింత బలపడేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

వివరాలు 

పురస్కారంపై సంతోషం వ్యక్తం చేసిన సునీల్ భారతీ మిట్టల్

ఫ్రాన్స్‌ నుంచి లభించిన ఈ గౌరవంపై సునీల్ భారతీ మిట్టల్‌ స్పందించారు.

ఈ గుర్తింపు తనను భావోద్వేగానికి గురిచేసిందని, ఎంతో వినయంగా భావిస్తున్నానని తెలిపారు.

ఎయిర్‌టెల్‌ ప్రారంభమైన సమయంలోనే ఫ్రాన్స్‌తో తన అనుబంధం మొదలైందని గుర్తుచేసుకున్నారు.

అప్పట్లో కాంపాగ్నీ జనరల్ డెస్ ఈయాక్స్ సంస్థ భారతీతో కలిసి భారత్‌లో మొబైల్‌ టెలిఫోన్‌ సేవలను ప్రారంభించిందని వివరించారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నానని చెప్పారు.

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషిని కొనసాగిస్తానని మిట్టల్‌ వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

అక్టోబర్‌ 28న న్యూదిల్లీలో పురస్కార ప్రదానోత్సవం

సునీల్ భారతీ మిట్టల్‌కు ఈ పురస్కారాన్ని అక్టోబర్‌ 28న న్యూదిల్లీలోని ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో అందజేయనున్నారు.

గతంలోనూ ఆయనకు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. 2007లో భారత్‌లో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌ను అందుకున్నారు.

2024లో బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌-3 నుంచి 'నైట్‌ కమాండర్‌ ఆఫ్‌ ద మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌' (కేబీఈ) గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ పౌరుడిగా నిలిచారు.

ADVERTISEMENT

వివరాలు 

యూటెల్‌శాట్‌లో భారతీ స్పేస్‌ పెట్టుబడులు

2025 నవంబర్‌లో యూటెల్‌శాట్‌ సంస్థ మూలధన సమీకరణలో భారతీ స్పేస్‌ కూడా పెట్టుబడులు పెట్టింది.

ప్రస్తుతం ఆ ఉపగ్రహ సేవల సంస్థలో 17.88 శాతం వాటాతో భారతీ స్పేస్‌ అతిపెద్ద ప్రైవేటు వాటాదారుగా కొనసాగుతోంది.

అయితే మొత్తం వాటాల్లో ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి 29.65 శాతం వాటా ఉండటంతో, అతిపెద్ద వాటాదారుగా ఆ దేశం కొనసాగుతోంది.

టెలికాం, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, ఉపగ్రహ సమాచార సేవలు వంటి కీలక రంగాల్లో భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతున్న సమయంలో మిట్టల్‌కు ఈ గౌరవం దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT