SUSE: ఆటోమేషన్ దిశగా ఎస్‌యూఎస్‌ఈ.. 10 శాతం ఉద్యోగాల కోత
ఈ వార్తాకథనం ఏంటి
ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఎస్‌యూఎస్‌ఈ (SUSE) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ సీఈఓ డిర్క్ పీటర్ వాన్ లీవెన్ అంతర్గత మెమో ద్వారా ఉద్యోగులకు వెల్లడించారు. ఆటోమేషన్, కృత్రిమ మేధ (ఏఐ) వైపు సంస్థను మళ్లించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎస్‌యూఎస్‌ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,900 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
వివరాలు
సాఫ్ట్‌వేర్ రంగంపై ఏఐ ప్రభావం
ఆటోమేషన్, ఏఐ కారణంగా సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని లీవెన్ పేర్కొన్నారు.
సాఫ్ట్‌వేర్ కంపెనీలు పనిచేసే విధానాన్ని ఆటోమేషన్, ఏఐ పూర్తిగా మార్చేస్తున్నాయని తెలిపారు.
ఈ మార్పులు ఎస్‌యూఎస్‌ఈ సంస్థకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతున్నాయని వివరించారు.
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో కొన్ని ఉద్యోగాల అవసరం తగ్గిపోయిందని అంగీకరించారు.
వివరాలు
ఉద్యోగుల తొలగింపు బాధాకరమైన నిర్ణయం: సీఈఓ
ఉద్యోగుల తొలగింపు నిర్ణయం బాధాకరమైనదేనని, అయితే సంస్థ దీర్ఘకాలిక మనుగడ, స్థిరత్వం కోసం తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చిందని లీవెన్ తెలిపారు.
ఈ నిర్ణయాలు ఉద్యోగులు, సంస్థ సంస్కృతి, ఓపెన్ సోర్స్ సమాజంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దేందుకు ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెంచుతూ, కొన్ని ఇతర విభాగాలకు ప్రాధాన్యం తగ్గిస్తున్నట్లు చెప్పారు.
భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలు, బృందాల నిర్మాణాన్ని కూడా మార్చనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
ఉద్యోగుల ప్రతిభ ఆధారంగా కాకుండా సంస్థ అవసరాల మేరకే తొలగింపులు
ఉద్యోగాల కోతకు ప్రభావితమయ్యే సిబ్బందికి నవంబర్ 4లోగా సమాచారం అందించనున్నట్లు ఎస్‌యూఎస్‌ఈ తెలిపింది.
మరుసటి రోజు ఉద్యోగుల ప్రతినిధులను ఎంపిక చేయనున్నారు. వచ్చే వారం ప్రారంభంలో ఉద్యోగులతో వ్యక్తిగత సమావేశాలు నిర్వహించనున్నారు.
మిగిలిన ఉద్యోగులకు నవంబర్ 16న సంస్థ 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యూహాన్ని వివరించనున్నారు.
ఈ తొలగింపులు ఉద్యోగుల వ్యక్తిగత ప్రతిభ లేదా అంకితభావం ఆధారంగా కాకుండా సంస్థ మారుతున్న అవసరాలను బట్టి తీసుకున్న నిర్ణయాలని లీవెన్ స్పష్టం చేశారు.
వివరాలు
1992లో ప్రారంభమైన ఎస్‌యూఎస్‌ఈ సంస్థ ప్రస్థానం
ఎస్‌యూఎస్‌ఈ (Software-und System-Entwicklung) సంస్థ 1992లో జర్మనీలో ప్రారంభమైంది.
లైనక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్స్, క్లౌడ్ సొల్యూషన్స్‌ను అందించే సంస్థగా గుర్తింపు పొందింది.
2018లో స్వీడన్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ (EQT) దీన్ని 2.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
2021లో ఫ్రాంక్‌ఫర్ట్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎస్‌యూఎస్‌ఈ షేర్లను లిస్ట్ చేసింది. అయితే ఆశించిన ఫలితాలు రాలేదు.
కొన్నేళ్ల తర్వాత లీవెన్ సంస్థ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2023లో ఈక్యూటీ సంస్థను మళ్లీ ప్రైవేట్ కంపెనీగా మార్చాలని నిర్ణయించింది.