Tata Sons: ఎయిర్ ఇండియాలో ₹10,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్న టాటా సన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియాలో రూ.10 వేల కోట్లకు పైగా అదనపు పెట్టుబడి పెట్టేందుకు టాటా సన్స్ బోర్డు ఆమోదం తెలిపింది. 2021లో రూ.18,000 కోట్లకు ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థలో పెట్టబోతున్న అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటిగా నిలవనుంది. టాటా సన్స్ బోర్డు సమావేశం ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అధ్యక్షతన జరిగింది. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా, వైస్ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ కూడా సమావేశానికి హాజరయ్యారు.
వివరాలు
పెట్టుబడికి కొన్ని షరతులు
ఎయిర్ ఇండియాతో పాటు టాటా గ్రూప్‌లోని ఇతర సంస్థల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్న బోర్డు నిర్ణయానికి కొన్ని షరతులు ఉన్నాయి.
టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 121ఏ ప్రకారం.. రూ.100 కోట్లకు మించిన పెట్టుబడులకు టాటా ట్రస్ట్స్ తరఫున ఉన్న నామినీ డైరెక్టర్లలో మెజారిటీ మద్దతు అవసరం.
దీంతో ఎయిర్ ఇండియా లేదా ఇతర సంస్థలు అదనపు నిధులు కోరినప్పుడు తమ వ్యాపార ప్రణాళికను, నిధులు ఎందుకు అవసరమో వివరించే ప్రతిపాదనను సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు
ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే..
ఎయిర్ ఇండియా నష్టాలు భారీగా పెరిగాయి.2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టాలు రెండింతలకు పైగా పెరిగి రూ.22,238కోట్లకు చేరాయి.
మరోవైపు ఎయిర్ ఇండియా రుణ భారం కూడా దాదాపు రూ.40,000కోట్లకు పెరిగింది.
ఈ రుణాలు 11బ్యాంకుల నుంచి తీసుకున్నవి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కి అత్యధికంగా రూ.18,500కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి.
ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.5,938కోట్ల మేర రుణాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో టాటాసన్స్‌కు 73.8శాతం వాటా ఉంది.సంస్థ ఉద్యోగులకు ఎస్‌బీఐక్యాప్ ట్రస్టీ కంపెనీ ద్వారా దాదాపు 1.5శాతం వాటా ఉంది.
మిగిలిన 24.7శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలిగి ఉంది.తాజా పెట్టుబడితో ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ఎయిర్ ఇండియాకు మరింత నిధుల మద్దతు లభించనుంది.