Loading...
US Tariff : వియత్నాం దిగుమతులపై అమెరికా కొత్త సుంకాలు.. టెస్లా, శామ్‌సంగ్ వ్యతిరేకత
వియత్నాం దిగుమతులపై అమెరికా కొత్త సుంకాలు.. టెస్లా, శామ్‌సంగ్ వ్యతిరేకత

US Tariff : వియత్నాం దిగుమతులపై అమెరికా కొత్త సుంకాలు.. టెస్లా, శామ్‌సంగ్ వ్యతిరేకత

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

వియత్నాం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై కొత్త సుంకాలు విధించాలన్న ప్రతిపాదనను టెస్లా, శామ్‌సంగ్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వియత్నాంపై అమెరికా చేపట్టిన వాణిజ్య పరిశీలన గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ అభ్యంతరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వియత్నాం దిగుమతులపై ఏకపక్షంగా టారిఫ్‌లు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు, తయారీ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని కంపెనీలు అమెరికా ప్రభుత్వానికి తెలిపాయి. అమెరికా తయారీదారులకు అవసరమైన విడిభాగాలు, ఇతర ఉత్పత్తుల సరఫరా వ్యవస్థలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని టెస్లా ప్రతినిధులు కోరారు.

వివరాలు 

వియత్నాంలో సుమారు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన శామ్‌సంగ్

వియత్నాంలో సుమారు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన శామ్‌సంగ్ సంస్థ అక్కడి నుంచి అమెరికా మార్కెట్లకు భారీ స్థాయిలో స్మార్ట్‌ఫోన్లు, నెట్‌వర్క్ పరికరాలను ఎగుమతి చేస్తోంది.

కొత్త సుంకాలు అమల్లోకి వస్తే తమ వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరుగుతాయని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం చేపట్టిన ఈ విచారణలో మేధో సంపత్తి హక్కులు, తయారీ కేంద్రాల మూలాలు, వాణిజ్య మిగులు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

ఇటీవలి కాలంలో వియత్నాం నుంచి అమెరికాకు ఎగుమతులు గణనీయంగా పెరగడంతో ఆ దేశానికి భారీ వాణిజ్య మిగులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వివరాలు 

భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న అమెరికాలోని కొన్ని దేశీయ పరిశ్రమలు

టెక్నాలజీ, తయారీ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు కొత్త సుంకాలను వ్యతిరేకిస్తుండగా, అమెరికాలోని కొన్ని దేశీయ పరిశ్రమలు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఉక్కు,కలప ఉత్పత్తులు,సీఫుడ్,సోలార్ ప్యానెల్స్ రంగాలకు చెందిన దేశీయ పరిశ్రమ సంఘాలు వియత్నాం వాణిజ్య విధానాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఆ దేశంపై కఠినమైన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.

మరోవైపు,సాఫ్ట్‌వేర్,చలనచిత్ర పరిశ్రమలకు చెందిన కాపీరైట్ సంస్థలు పైరసీని అరికట్టేందుకు మరింత కఠినమైన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నాయి.

ఈ నేపథ్యంలో నవంబర్ చివరి నాటికి ముగియనున్న అమెరికా వాణిజ్య పరిశీలనపై ఆసక్తి నెలకొంది.

టెస్లా,శామ్‌సంగ్ వంటి సంస్థల అభ్యంతరాలు, దేశీయ పరిశ్రమల డిమాండ్ల మధ్య అమెరికా ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

ADVERTISEMENT