భారతదేశంలో పూర్తిగా సిబ్బందిని తొలగించి కార్యాలయాన్ని మూసేసిన టిక్ టాక్
2020లో భారతదేశంలో నిషేదించిన షార్ట్ వీడియో ప్లాట్ఫాం టిక్‌టాక్ దేశంలోని తన కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకుంది. సంస్థలో మిగిలిన 40 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసింది. ఒకప్పుడు దేశంలో ఆండ్రాయిడ్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్స్ ఉన్న టిక్‌టాక్ యాప్ జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా నిషేధించబడింది. ఇప్పుడు యూఎస్‌లో కూడా టిక్‌టాక్ పేరెంట్ సంస్థ బైట్ డాన్స్ కు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. టిక్ టాక్ పై నిషేధం విధించనప్పటి నుండి భారత ప్రభుత్వంతో రాజీకు ప్రయత్నిస్తోంది. గత సంవత్సరం, ఈ సంస్థ మరొక స్థానిక భాగస్వామితో తిరిగి భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి.
తొలగించిన ఉద్యోగులకు తొమ్మిది నెలల వేతనం లభిస్తుంది
ఈ కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగులను ఈ వారం ప్రారంభంలో తొలగించనున్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది. తొలగించనున్న ఉద్యోగులకు తొమ్మిది నెలల వేతనం లభిస్తుంది, ఫిబ్రవరి 28 కంపెనీలో వారికి ఆఖరి రోజు. ఈ నిషేధం తర్వాత భారతదేశంలో సిబ్బంది బ్రెజిల్, దుబాయ్‌లో కంపెనీ కార్యకలాపాలను చూసుకున్నారు. గ్లోబల్, రీజినల్ సేల్స్ టీమ్‌లకు సపోర్ట్ అందించడానికి 2020 చివరిలో ఇండియా రిమోట్ సేల్స్ సపోర్ట్ హబ్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని టిక్‌టాక్ ప్రతినిధి తెలిపారు. ఇప్పుడు, ఈ యాప్ ను USలో కూడా నిషేదించాలని నిపుణులు పట్టుబడుతున్నారు. US పౌరుల డేటాను యాక్సెస్ చేయడానికి చైనా ప్రభుత్వం యాప్‌ను ఉపయోగించవచ్చనే ఆందోళనలు చాలా మందిలో ఉన్నాయి.