Loading...
TVS family feud: టీవీఎస్‌ కుటుంబంలో వారసత్వ వివాదం.. ఆస్తుల పంపకాలపై తల్లీకూతుళ్ల ప్రకటన
టీవీఎస్‌ కుటుంబంలో వారసత్వ వివాదం.. ఆస్తుల పంపకాలపై తల్లీకూతుళ్ల ప్రకటన

TVS family feud: టీవీఎస్‌ కుటుంబంలో వారసత్వ వివాదం.. ఆస్తుల పంపకాలపై తల్లీకూతుళ్ల ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ గౌరవ ఛైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త వేణు శ్రీనివాసన్‌ కుటుంబంలో వారసత్వానికి సంబంధించిన విభేదాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. కుటుంబ ఆస్తుల పంపకాలపై ఎలాంటి పరస్పర అంగీకారం కుదరలేదని ఆయన భార్య మల్లికా శ్రీనివాసన్‌, కుమార్తె లక్ష్మి వేణు సంయుక్తంగా స్పష్టం చేశారు. కుటుంబ సంపద మొత్తం ఒకరి ఆధీనంలోనే ఉండాలని, దానిని తన ఇష్టానుసారం విభజించే అధికారం కూడా ఆ వ్యక్తికే ఉండాలనే ప్రతిపాదనపై అంగీకారం కుదరలేదని వారు వెల్లడించారు.

వివరాలు 

మీడియా కథనాల నేపథ్యంలో వివరణ

కుటుంబ సమస్యను అంతర్గత చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని తాము మొదట భావించినట్లు మల్లికా శ్రీనివాసన్‌, లక్ష్మి వేణు తెలిపారు.

అయితే, ఈ వ్యవహారంపై మీడియాలో పలు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.

2020లో టీవీఎస్‌ కుటుంబ వ్యాపారాల విభజన ప్రక్రియ జరిగినప్పుడు సంబంధిత వాటాదారులందరినీ భాగస్వాములను చేసి నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు.

అయితే, వేణు శ్రీనివాసన్‌ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు, వ్యక్తిగత ఆస్తుల పంపకాల విషయంలో పరస్పర అంగీకారంతో కూడిన ప్రక్రియ ఏదీ జరగలేదని స్పష్టం చేశారు.

కుటుంబ ఆస్తులపై ఒకే వ్యక్తికి పూర్తి అధికారం ఇచ్చి, వాటిని ఏకపక్షంగా పంపిణీ చేసుకునే స్వేచ్ఛ కల్పించాలనే అంశంపై కూడా ఏకాభిప్రాయం కుదరలేదని తమ ప్రకటనలో పేర్కొన్నారు.

వివరాలు 

శతాబ్దం చరిత్ర ఉన్న టీవీఎస్‌ గ్రూప్

టీవీఎస్‌ ఇండస్ట్రియల్‌ గ్రూప్‌ను సుమారు వందేళ్ల క్రితం టీవీ సుందరమ్‌ అయ్యంగార్‌ స్థాపించారు.

ఈ సంస్థను 2020లో పలు వ్యాపార విభాగాలుగా విభజించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అంగీకారంతో ఆస్తులను పంచి, ఆయా విభాగాలను వారికి అప్పగించారు.

ఈ విభజనలో భాగంగా టీవీఎస్‌ మోటార్‌ కంపెనీతో పాటు దాని హోల్డింగ్‌ సంస్థ అయిన టీవీఎస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌పై నియంత్రణ వేణు శ్రీనివాసన్‌ కుటుంబానికి దక్కింది.

అయితే, ప్రస్తుతం తెరపైకి వచ్చిన వివాదం గతంలో జరిగిన గ్రూప్‌ విభజనకు భిన్నంగా, కుటుంబ సంపద పంపకాలు, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించినదిగా ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

ట్రస్ట్‌ వ్యవస్థతో మొదలైన విభేదాలు

2025 ఏప్రిల్‌లో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌ వేణును ట్రస్ట్‌ వ్యవస్థల ద్వారా ముఖ్యమైన లబ్ధిదారుగా నియమించినట్లు టీవీఎస్‌ హోల్డింగ్స్‌ వెల్లడించింది.

ఈ పరిణామం తర్వాత కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

వాహన విడిభాగాల తయారీ సంస్థ సుందరం క్లేటాన్‌ లిమిటెడ్‌కు నాయకత్వం వహిస్తున్న లక్ష్మి వేణు తనకు సంబంధించిన హక్కులను కోరినట్లు సమాచారం.

కుటుంబ సంపదకు సంబంధించి న్యాయమైన పరిష్కారం లభించేలా చర్చలు, సంప్రదింపులు కొనసాగించాలని ఆమె కోరుతున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.

ADVERTISEMENT

వివరాలు 

2024 ఒప్పందం దేనికి సంబంధించింది?

మల్లికా శ్రీనివాసన్‌, లక్ష్మి వేణు తాజా ప్రకటనలో మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు.

2024 మార్చిలో కుటుంబ సభ్యుల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ, దాని పరిధి పరిమితమేనని వివరించారు.

వివిధ వ్యాపార విభాగాల్లో టీవీఎస్‌ బ్రాండ్‌ను ఉపయోగించుకోవడం, పోటీ వ్యాపారాలకు దూరంగా ఉండటం వంటి అంశాలకే ఆ ఒప్పందం పరిమితమైందని తెలిపారు.

కుటుంబ సంపదకు సంబంధించిన ఆర్థిక పరిష్కారం లేదా ఆస్తుల విలువ ఆధారంగా పంపకాలు జరిపేందుకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేశారు.

దీంతో బ్రాండ్‌ వినియోగం, వ్యాపార సంబంధాలపై కుదిరిన అవగాహనకు, కుటుంబ ఆస్తుల పంపకాలకు మధ్య తేడా ఉందనే విషయాన్ని వారు వెల్లడించారు.

వివరాలు 

కీలక వ్యాపారాల్లో కుటుంబ వాటాలు

వేణు శ్రీనివాసన్‌ కుటుంబం టీవీఎస్‌ హోల్డింగ్స్‌, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ,టీవీఎస్‌ క్రెడిట్‌, ఎన్‌సీఎల్‌ సహా పలు కీలక వ్యాపారాల్లో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.

ప్రస్తుతం వేణు శ్రీనివాసన్‌ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

టీవీఎస్‌ హోల్డింగ్స్‌ వార్షిక నివేదిక ప్రకారం,ఆసంస్థలో కుటుంబం లేదా ప్రమోటర్‌ వర్గానికి కలిపి 74.45శాతం వాటా ఉంది.

ఇందులో వేణుశ్రీనివాసన్‌ వీఎస్‌ ట్రస్ట్‌ ద్వారా 66.55శాతం వాటాను కలిగి ఉన్నారు.

ఇక టీవీఎస్‌ మోటార్‌ కంపెనీలో టీవీఎస్‌ హోల్డింగ్స్‌కు 56శాతం వాటా ఉంది.

ప్రస్తుతం టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు రూ.1.88లక్షల కోట్లుగా ఉంది.

ఈ నేపథ్యంలో కుటుంబ ఆస్తులపంపకాలు, ట్రస్ట్‌ల ద్వారా వాటాల నిర్వహణ,వారసత్వ హక్కులకు సంబంధించిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ADVERTISEMENT