IDFC First Bank: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మోసం కేసులో ట్విస్ట్.. 24 గంటల్లోనే రూ.556 కోట్లు రికవరీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు చండీగఢ్ శాఖలో జరిగిన భారీ మోసం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. హరియాణా ప్రభుత్వానికి చెందిన రూ.556 కోట్ల నిధులు తిరిగి రికవరీ అయినట్లు నయాబ్ సింగ్ సైని మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. రూ.22 కోట్ల వడ్డీతో కలిపి మొత్తం దాదాపు రూ.556 కోట్లు 24 గంటల వ్యవధిలోనే తిరిగి వచ్చాయని ఆయన తెలిపారు. చండీగఢ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న మధ్య, చిన్నస్థాయి ఉద్యోగులు కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు బ్యాంకు వెల్లడించిందని సీఎం సైనీ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారికి ఉపశమనం ఉండదన్నారు. గత ఆదివారం హరియాణా ప్రభుత్వానికి చెందిన బ్యాంకు ఖాతాల నుంచి సుమారు రూ.590 కోట్ల వరకు మోసం జరిగిందని బ్యాంకు వెల్లడించింది.
Details
కోలుకున్న షేరు ధర
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఏసీబీకి ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం తెలిపారు. అదేవిధంగా ఆర్థిక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మోసం బయటపడిన నేపథ్యంలో నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు 16 శాతం వరకు క్షీణించాయి. అయితే నేడు పరిస్థితి మెరుగుపడి, భారత జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఒక శాతం లాభంతో రూ.71.08 వద్ద ట్రేడవుతున్నాయి. హరియాణా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఖాతాలకే ఈ మోసం పరిమితమైందని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ వి. వైద్యనాథన్ తెలిపారు. శాఖలోని ఇతర ఖాతాదారుల డిపాజిట్లకు లేదా ఖాతాలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు.