Page Loader
Uber Auto: ఉబర్‌ కొత్త నిబంధన.. ఆటో రైడ్స్‌కు కేవలం క్యాష్‌ పేమెంట్‌
ఉబర్‌ కొత్త నిబంధన.. ఆటో రైడ్స్‌కు కేవలం క్యాష్‌ పేమెంట్‌

Uber Auto: ఉబర్‌ కొత్త నిబంధన.. ఆటో రైడ్స్‌కు కేవలం క్యాష్‌ పేమెంట్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2025
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబర్‌ తన విధానంలో కీలక మార్పు చేసింది. ఇకపై ఉబర్‌ ద్వారా ఆటో బుక్‌ చేసుకున్న ప్రయాణికులు నగదు రూపంలో నేరుగా డ్రైవర్‌కే చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికుడు, ఆటో డ్రైవర్‌ మధ్య జరిగే లావాదేవీలకు ఉబర్‌ జోక్యం చేసుకోదని సంస్థ ప్రకటించింది. 'సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌' విధానాన్ని అమలు చేయడంలో భాగంగా ఫిబ్రవరి 18 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఆటో రైడ్స్‌ నుంచి ఉబర్‌ ఎటువంటి కమీషన్‌ వసూలు చేయదని బ్లాగ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. ఉబర్‌లో ఆటో బుక్‌ చేసిన తర్వాత సమీపంలోని డ్రైవర్లతో అనుసంధానం చేస్తుంది. రైడ్‌ పూర్తయిన తర్వాత నగదు లేదా యూపీఐ ద్వారా ప్రయాణికులు నేరుగా డ్రైవర్‌కు చెల్లించాలి.

Details

 క్యాన్సిలేషన్‌ ఛార్జీలుండవు

ఉబర్‌ క్రెడిట్స్‌, ఇతర ప్రమోషనల్‌ ఆఫర్లు ఈ కొత్త విధానంలో వర్తించవు. అలాగే, క్యాన్సిలేషన్‌ ఛార్జీలు కూడా ఉండవని స్పష్టం చేసింది. రైడ్‌ బుకింగ్‌ సమయంలో ఉబర్‌ అంచనా ఫేర్‌ను సూచిస్తుంది, కానీ ఇది తుది చెల్లించాల్సిన మొత్తం కాదు. ఆటో డ్రైవర్‌ మరియు ప్రయాణికుడు పరస్పర అవగాహనతో తుది చెల్లింపు మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. ఇకపై ఆటో డ్రైవర్లు పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరిస్తారని, ఉబర్‌ కేవలం కనెక్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే పని చేస్తుందని వెల్లడించింది. ఇప్పటికే ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు కమీషన్‌ ఆధారంగా కాకుండా, సాఫ్ట్‌వేర్‌ సేవలను అందించేందుకు ఈ విధానాన్ని ప్రారంభించాయి. ట్రిప్‌కు కమీషన్‌ చెల్లించాల్సిన అవసరం లేకుండా, డ్రైవర్లు ప్లాట్‌ఫామ్‌ వాడేందుకు కొంత మొత్తం చెల్లించే విధానాన్ని అనుసరిస్తున్నారు.