LOADING...
Indian Overseas Bank:15 రోజుల్లో డెత్‌క్లెయిమ్‌ సెటిల్‌మెంట్ ప్రక్రియను సులభం చేసిన ఐఓబీ
15 రోజుల్లో డెత్‌క్లెయిమ్‌ సెటిల్‌మెంట్ ప్రక్రియను సులభం చేసిన ఐఓబీ

Indian Overseas Bank:15 రోజుల్లో డెత్‌క్లెయిమ్‌ సెటిల్‌మెంట్ ప్రక్రియను సులభం చేసిన ఐఓబీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

కుటుంబంలో ఎవరు అయినా మృతి చెందితే, వారి బ్యాంక్‌ ఖాతాలో ఉన్న డబ్బును పొందడం చాలా మందికి తలనొప్పిగా మారుతోంది. మరణ ధ్రువీకరణ పత్రం,పాస్‌బుక్‌,మృతుడు కుటుంబ సభ్యుడేనని నిరూపించే పత్రాలు తీసుకెళ్లినా కూడా బ్యాంకుల చుట్టూ పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. అయినా పని పూర్తవుతుందన్న నమ్మకం ఉండడం లేదు.ఈ కారణంగా తక్కువ మొత్తంలో నగదు ఉన్న ఖాతాల విషయంలో కొంతమంది కుటుంబ సభ్యులు ఆ డబ్బును తీసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ పరిస్థితులకు పరిష్కారంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక సులభమైన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. డెత్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ కోసం పూర్తిగా ఆన్‌లైన్‌ సదుపాయాన్ని ప్రారంభించింది.

వివరాలు 

దరఖాస్తు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపే క్లెయిమ్

ఖాతాదారు మరణించినప్పుడు కుటుంబ సభ్యులు లేదా చట్టబద్ధమైన వారసులు ఇకపై బ్యాంక్‌ శాఖకు వెళ్లకుండానే క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. రూ.15 లక్షల వరకు ఉన్న డెత్‌ క్లెయిమ్‌లకు ఎలాంటి థర్డ్‌ పార్టీ ష్యూరిటీ అవసరం లేదని బ్యాంక్‌ స్పష్టం చేసింది. అంతేకాకుండా దరఖాస్తు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపే క్లెయిమ్‌ మొత్తాన్ని సెటిల్‌ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఐఓబీ అధికారిక పోర్టల్‌లోని డెత్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ విభాగంలోకి వెళ్లి అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. క్లెయిమ్‌ ఫారం,ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం,నామినీ గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ నామినీ లేకపోతే ఇండెమ్నిటీ బాండ్‌, డిస్‌క్లెయిమర్‌ లెటర్‌,లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌ వంటి పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

వివరాలు 

క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ నిబంధనలను సవరించిన ఆర్బీఐ 

ఇదిలా ఉండగా డెత్‌ క్లెయిమ్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది సెప్టెంబర్‌లో కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. మృతుల బ్యాంక్‌ ఖాతాలు, లాకర్లకు సంబంధించిన క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ నిబంధనలను సవరించింది. క్లెయిమ్‌ ప్రక్రియను గరిష్ఠంగా 15 రోజులలోపే పూర్తి చేయాలని, ఆలస్యం జరిగితే నామినీలకు నిర్దిష్ట పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. 2026 మార్చి 31 నాటికి అన్ని బ్యాంకులు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ ఆన్‌లైన్‌ డెత్‌ క్లెయిమ్‌ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో ఇతర బ్యాంకులు కూడా ఇలాంటి సదుపాయాలను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement