LOADING...
US Supreme Court tariff decision: ట్రంప్ టారిఫ్‌ల తీర్పుతో ఇండియన్ మార్కెట్లకు ఊరట దక్కుతుందా? 
ట్రంప్ టారిఫ్‌ల తీర్పుతో ఇండియన్ మార్కెట్లకు ఊరట దక్కుతుందా?

US Supreme Court tariff decision: ట్రంప్ టారిఫ్‌ల తీర్పుతో ఇండియన్ మార్కెట్లకు ఊరట దక్కుతుందా? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా సుప్రీంకోర్టు, ట్రంప్ పరిపాలన అమెరికా వ్యాపార భాగస్వామ్య దేశాలపై విధించిన టారిఫ్‌లపై కీలక తీర్పును జనవరి 14న వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఈ టారిఫ్‌ల చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో గత శుక్రవారం, జనవరి 9న కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. సాధారణంగా అమెరికా సుప్రీంకోర్టు తీర్పులు వెల్లడించే రోజులు ఉదయం 10 గంటలకు (ఈస్ట్రన్ టైమ్) అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు తీర్పులను ప్రకటిస్తుంది. గత ఏడాది ఏప్రిల్ 2న ట్రంప్ దాదాపు అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై 10 శాతం నుంచి 50 శాతం వరకు టారిఫ్‌లు విధించారు.

వివరాలు 

అత్యున్నత న్యాయస్థానం తుది నిర్ణయం

అయితే, ప్రస్తుత చట్టాల ప్రకారం అధ్యక్షుడికి ఉన్న అధికారాలను మించి ఈ నిర్ణయాలు ఉన్నాయంటూ కోర్టులో సవాల్ చేశారు. ఫెడరల్ కోర్టులు ఇప్పటికే ఈ టారిఫ్‌లలో చాలావరకు అధ్యక్ష అధికార పరిధిని మించినవేనని పేర్కొనడంతో, ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (IEEPA)ను ఉపయోగించి ట్రంప్ టారిఫ్‌లు విధించవచ్చా లేదా అన్నదానిపై అత్యున్నత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోనుంది.

వివరాలు 

భారత ఈక్విటీ మార్కెట్‌లో భారీ ర్యాలీ జరిగి నిఫ్టీ 50 కొత్త రికార్డులను తాకుతుందా? 

ఈ నేపథ్యంలో, ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే భారత స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయికి చేరుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భారత ఉత్పత్తులపై ట్రంప్ విధించిన టారిఫ్‌లు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) భారీగా షేర్లను విక్రయించడానికి, రూపాయి బలహీనపడటానికి, దేశీయ మార్కెట్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి ప్రధాన కారణాలుగా మారాయి. అయితే, ఈ టారిఫ్‌లను రద్దు చేసే తీర్పు వస్తే భారత ఈక్విటీ మార్కెట్‌లో భారీ ర్యాలీ జరిగి నిఫ్టీ 50 కొత్త రికార్డులను తాకుతుందా అన్నదానిపై నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ వ్యూహంలో టారిఫ్‌లు కీలక భాగమే కాబట్టి, ఆయన ఇతర మార్గాల ద్వారా మళ్లీ ఆంక్షలు విధించే అవకాశముందని మార్కెట్ ఇప్పటికే అంచనా వేస్తోందని వారు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

చట్టపరమైన లేదా విధానపరమైన మార్గాల ద్వారా ఆంక్షలు కొనసాగించే అవకాశం

ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ పంకజ్ పాండే మాట్లాడుతూ, "ఈ తీర్పుతో మార్కెట్‌కు కొంత ఊరట కలగొచ్చు. కానీ ప్రభావం పరిమితంగానే ఉంటుంది. ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా, టారిఫ్‌లు ఆయన ప్రధాన వ్యూహంలో భాగంగానే ఉంటాయి. ఇతర చట్టపరమైన లేదా విధానపరమైన మార్గాల ద్వారా ఆంక్షలు కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ఇది దీర్ఘకాలిక బూస్ట్ కంటే తాత్కాలిక సెంటిమెంట్ మెరుగుదలకే పరిమితం కావచ్చు" అన్నారు. రెలిగేర్ బ్రోకింగ్‌లో ఎస్వీపీ ఆఫ్ రీసెర్చ్ అజిత్ మిశ్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

వివరాలు 

పెద్ద ర్యాలీకి ఇది కారణం కాబోదు

"ఈ తీర్పు మార్కెట్లకు గేమ్ చేంజర్ అవుతుందని నేను అనుకోవడం లేదు. సుప్రీంకోర్టు నుంచి ప్రతికూల తీర్పు వచ్చినా, దానికి తగిన మార్పులు, కొత్త చట్టాలు, ఇతర శాసన మార్గాలకు పరిపాలన ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి" అని చెప్పారు. "ఈ తీర్పు విధానాలను గణనీయంగా మార్చేదిగా ఉంటే, మార్కెట్లు ముందుగానే స్పందించేవి. ఎక్కువగా చూస్తే కొన్ని రంగాల్లో పరిమిత ఊరట మాత్రమే కనిపించవచ్చు. కానీ పెద్ద ర్యాలీకి ఇది కారణం కాబోదు" అని మిశ్రా తెలిపారు.

వివరాలు 

 కంపెనీల ఆదాయ వృద్ధిపైనే పెట్టుబడిదారుల దృష్టి 

ప్రస్తుతం మార్కెట్లను నడిపిస్తున్న ప్రధాన అంశం కార్పొరేట్ లాభాలే అని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలతో పాటు, కంపెనీల ఆదాయ వృద్ధిపైనే పెట్టుబడిదారుల దృష్టి ఎక్కువగా ఉంది. అయితే, ట్రంప్ టారిఫ్ విధానాలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్రపంచ వాణిజ్య విధానాలపై ఉన్న అనిశ్చితి కొంత తగ్గి, ప్రారంభ దశలో భారత మార్కెట్‌కు లాభం చేకూరవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ రవి సింగ్ మాట్లాడుతూ, వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న సంకేతాలు సాధారణంగా మార్కెట్లకు అనుకూలంగా ఉంటాయని, ఈ తరహా తీర్పు గ్లోబల్ రిస్క్ ఆపెటైట్‌ను పెంచి, FIIల పెట్టుబడులకు దారితీయవచ్చని తెలిపారు.

వివరాలు 

ర్యాలీ ఆటోమేటిగ్గా దీర్ఘకాలిక బుల్ రన్‌గా మారుతుందని చెప్పలేం: సింగ్

అధిక టారిఫ్‌లు, ఎగుమతి ఆలస్యాలు, మూలధన నిష్క్రమణల కారణంగా ఒత్తిడిలో ఉన్న భారత ఈక్విటీ మార్కెట్‌కు, సెంటిమెంట్ మెరుగుపడితే తాత్కాలిక ర్యాలీ కనిపించే అవకాశముందని సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ర్యాలీ ఆటోమేటిగ్గా దీర్ఘకాలిక బుల్ రన్‌గా మారుతుందని చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు. "అమెరికా వడ్డీ రేట్ల అంచనాలు, చమురు ధరలు, భౌగోళిక-రాజకీయ ప్రమాదాలు, దేశీయ కార్పొరేట్ లాభాల వృద్ధి వంటి అంశాలపై పెట్టుబడిదారులు ఇంకా నిశితంగా దృష్టి పెట్టే ఉంటారు" అని రవి సింగ్ తెలిపారు.

Advertisement