Warren Buffett: కార్పొరేట్ చరిత్రలో కీలక పరిణామం.. నేడు సీఈఓ పదవి నుంచి దిగిపోనున్న వారెన్ బఫెట్
ఈ వార్తాకథనం ఏంటి
ఆధునిక కార్పొరేట్ నాయకత్వ చరిత్రలో బుధవారం ఒక కీలక ఘట్టం నమోదు కానుంది. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్‌వే సీఈఓ పదవికి నేడు వీడ్కోలు పలకనున్నారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు సంస్థకు సీఈఓగా సేవలందించిన ఆయన, తన బాధ్యతలను గ్రెగ్ అబెల్‌కు అధికారికంగా అప్పగించారు. 1965లో బెర్క్‌షైర్ హాత్‌వే బాధ్యతలను స్వీకరించిన బఫెట్, టెక్స్‌టైల్ వ్యాపారంగా ఉన్న సంస్థను బీమా, రైల్వేలు, వినియోగ వస్తువుల బ్రాండ్లు, ఈక్విటీ పెట్టుబడుల దిశగా విస్తరించారు. క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలు, దీర్ఘకాలిక దృష్టితో రూపొందించిన పెట్టుబడి వ్యూహాల ద్వారా వాటాదారులకు అసాధారణ లాభాలను అందించారు. స్టాక్ మార్కెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఇన్వెస్టర్లలో ఒకరిగా ఆయనకు విశేష గుర్తింపు లభించింది.
వివరాలు
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా గ్రెగ్ అబెల్
తన పెట్టుబడి ప్రయాణంలో సంపాదించిన అనుభవాలతో చెప్పిన మదుపు సూత్రాలు కోట్లాది పెట్టుబడిదారులకు మార్గదర్శకంగా నిలిచాయి. బెర్క్‌షైర్ హాత్‌వే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు బఫెట్ ఇప్పటికే ప్రకటించగా, జనవరి 1 నుంచి కొత్త నాయకత్వం అధికారికంగా బాధ్యతలు చేపట్టనుంది. ఆయన రెండో కుమారుడు హువర్డ్ బఫెట్ కంపెనీ ఛైర్మన్‌గా, గ్రెగ్ అబెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించనున్నారు. సీఈఓ పదవికి వీడ్కోలు పలుకుతూ బఫెట్ ఇప్పటికే ఇన్వెస్టర్లకు ఒక లేఖ రాశారు. 95 ఏళ్ల వరకు జీవించడం తనకు లభించిన అదృష్టమని, అదే సమయంలో ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
వివరాలు
దాతృత్వ కార్యక్రమాల కోసం 50 బిలియన్ డాలర్ల సంపద
1938లో తనకు ఎనిమిదేళ్ల వయసులో అపెండిసైటిస్ రావడంతో ప్రాణాపాయ స్థితికి చేరి తిరిగి బయటపడ్డ సంఘటనను గుర్తు చేసుకున్నారు. అదే సందర్భంలో తన 1.3 బిలియన్ డాలర్ల సంపదను నాలుగు కుటుంబ ఫౌండేషన్లకు విరాళంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 1800 'ఏ' షేర్లను 27 లక్షల 'బీ' షేర్లుగా మార్చి ఆ నాలుగు ఫౌండేషన్లకు పంచారు. ఇప్పటివరకు సుమారు 50 బిలియన్ డాలర్ల సంపదను దాతృత్వ కార్యక్రమాల కోసం వినియోగించిన విషయం తెలిసిందే.