EPS Pension: రూ.1,000 పెన్షన్ ఇక రూ.7,500 కానుందా? కేంద్రం ఏం చెప్పిందంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) దేశంలోని పెన్షనర్లకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ పథకం కింద లభిస్తున్న కనీస నెలవారీ పెన్షన్ రూ.1,000 సరిపోవడం లేదని పెన్షనర్లు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌పై ఈపీఎస్-95 నేషనల్ అజిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 5, 2026న న్యూఢిల్లీలో నిరసన జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో ఈపీఎస్ పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంఘం.. కనీస పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
వివరాలు
కేంద్రం ఏం చెప్పిందంటే?
ఈ అంశం సోమవారం లోక్‌సభలోనూ ప్రస్తావనకు వచ్చింది.
ఎంపీ రామ్‌వీర్ సింగ్ బిధూరి..ఈపీఎస్-95 కింద లభిస్తున్న కనీస పెన్షన్‌ను పెంచే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం పరిశీలిస్తోందా? అని ప్రశ్నించారు.
అలాగే ఈ పథకం పరిధిలో ఎంతమంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారనే వివరాలను కూడా కోరారు.
బిధూరి ప్రశ్నకు కేంద్ర కార్మిక,ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానం ఇచ్చారు.
ఈపీఎస్ సభ్యులకు ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ అందిస్తోందని,ఇందుకోసం వేతనాల్లో 1.16శాతం మేర కేంద్ర బడ్జెట్ నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
ఈపీఎస్ పెన్షన్ నిధికి యజమానుల వాటాగా వేతనాల్లో 8.33శాతం జమ అవుతుందని వివరించారు.
అలాగే నెలకు రూ.15,000వరకు వేతనంపై కేంద్రప్రభుత్వం 1.16శాతం చొప్పున బడ్జెట్ సాయం అందిస్తుందని చెప్పారు.
వివరాలు
85 లక్షలకుపైగా పెన్షనర్లు
ఈపీఎఫ్‌వో పథకం సభ్యులకు బలమైన సామాజిక భద్రత కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కరంద్లాజే తెలిపారు.
అదే సమయంలో పెన్షన్ నిధులు దీర్ఘకాలం కొనసాగేందుకు అవసరమైన స్థిరత్వాన్ని కూడా కాపాడుతున్నట్లు చెప్పారు.
2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా ఈపీఎస్ పథకం కింద 85 లక్షలకుపైగా పెన్షనర్లు ఉన్నారని వెల్లడించారు.
వారికి మొత్తం రూ.15,819.28 కోట్ల పెన్షన్‌ను పంపిణీ చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే.. ఈపీఎస్ కనీస పెన్షన్‌ను త్వరలోనే రూ.7,500కు పెంచే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది.
పెన్షనర్లు, సంఘాలు మాత్రం పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో పెట్టుకుని కనీస పెన్షన్‌ను పెంచాలని కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తున్నాయి.