AR. Rahman: ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు.. ఏఆర్ రెహమాన్ ఫ్యామిలీ అరుదైన ఘనత!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుటుంబం సంగీతానికి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 'అమరన్' చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ ఎంపికయ్యారు. ఈ అవార్డు ఆయన కెరీర్‌లో మూడో జాతీయ పురస్కారం కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ కుటుంబంలో సంగీతం తరతరాలుగా కొనసాగుతోంది. రెహమాన్ తండ్రి నుంచి ప్రారంభమైన ఈ సంగీత వారసత్వాన్ని ఆయన సోదరి రెహానా, కుమార్తె ఖతీజా, కుమారుడు ఏఆర్. అమీన్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఏఆర్ రెహమాన్‌కు మేనల్లుడు కావడం తెలిసిందే.
వివరాలు
సోషల్ మీడియా వేదికగా ఏఆర్ రెహమాన్ హర్షం
జీవీ ప్రకాష్ కుమార్‌కు ఇది వరుసగా మూడో జాతీయ అవార్డు. 2019లో సూర్య హీరోగా నటించిన 'సూరరై పోట్రు' (తెలుగులో 'ఆకాశమే హద్దురా') చిత్రానికి సంగీతం అందించి తొలి జాతీయ అవార్డును అందుకున్నారు.
అనంతరం 2024లో 'వాత్తి' చిత్రానికి మరోసారి జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. తాజాగా 'అమరన్' చిత్రానికి అందించిన నేపథ్య సంగీతంతో మూడోసారి ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా మేనల్లుడు సాధించిన విజయంపై ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
జీవీ ప్రకాష్ కుమార్, మీరు మూడో జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు.
వివరాలు
ఎంతో గర్వంగా ఉంది
ఇది మన కుటుంబం సాధించిన 10వ జాతీయ అవార్డు. మా కుటుంబానికి ఇది ఎంతో గర్వకారణమైన క్షణం. సంగీతంపై మీ ఆసక్తి, నిజాయితీ, అంకితభావమే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి.
భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లు అధిగమించాలని కోరుకుంటున్నాను. దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని ఏఆర్ రెహమాన్ తన సందేశంలో పేర్కొన్నారు.