Premadesam: 30 వసంతాల 'ప్రేమదేశం'.. వెండితెరపై చెరగని ప్రేమకావ్యం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేమ గొప్పదా? స్నేహం గొప్పదా? అనే ప్రశ్నకు సమాధానంగా.. రెండూ గొప్పవే కానీ, స్నేహం కోసం తన ప్రేమను సైతం త్యాగం చేయడం మరింత గొప్పదని చాటిచెప్పిన సినిమా 'ప్రేమదేశం'. అబ్బాస్, వినీత్, టబు ప్రధాన పాత్రల్లో తమిళ దర్శకుడు కదిర్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేమకథా చిత్రాల్లో ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ అందించిన అద్భుతమైన సంగీతం, కాలేజీ నేపథ్యంలోని సన్నివేశాలు 90ల నాటి యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 1996 ఆగస్టు 23న విడుదలైన ఈ సినిమా నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 'ప్రేమదేశం' విశేషాలు మీకోసం.
వివరాలు
తమిళ ప్రేక్షకులకు టబు పరిచయం...
దర్శకుడు కదిర్ తమిళంలో తెరకెక్కించిన తొలి చిత్రం 'ఇదయం' అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సినిమా కల్ట్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆయన తీసిన 'ఉళవన్' సినిమా కూడా ప్రేక్షకులను ఫర్వాలేదనిపించింది.
ఈ క్రమంలో స్నేహబంధంలోని గొప్పతనాన్ని, ప్రేమలోని గాఢతను మేళవిస్తూ కదిర్ ఓ కథను సిద్ధం చేసుకున్నారు.
'జెంటిల్‌మేన్', 'ప్రేమికుడు' వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత కుంజుమన్‌కు కథ వినిపించారు.
కథ నచ్చడంతో ఆయన సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు.
స్వచ్ఛమైన ప్రేమకథకు కొత్తవాళ్లు అయితే మరింత బాగుంటుందని కదిర్ భావించారు.
అందుకే సినిమాలతో ఎలాంటి సంబంధం లేని అబ్బాస్‌ను హీరోగా ఎంపిక చేశారు.
తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని టబును హీరోయిన్‌గా తీసుకున్నారు.
వివరాలు
కథేంటంటే..
కార్తిక్(వినీత్), అరుణ్(అబ్బాస్) వేర్వేరు కళాశాలలకు చెందిన ఫుట్‌బాల్ జట్ల కెప్టెన్లు.
ఇద్దరి మధ్య మొదట్లో శత్రుత్వం ఉంటుంది. అయితే ఓ ప్రమాదంలో అరుణ్ ప్రాణాలను కార్తిక్ కాపాడటంతో వారి మధ్య స్నేహం చిగురిస్తుంది.
ఆ తర్వాత ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారతారు. కొంతకాలానికి వారి జీవితాల్లోకి దివ్య(టబు) వస్తుంది.
కార్తిక్, అరుణ్ ఇద్దరూ దివ్యను ప్రేమిస్తారు. తామిద్దరూ ప్రేమిస్తున్నది ఒకే అమ్మాయినేనని తెలుసుకున్న తర్వాత వారి స్నేహబంధంలో మళ్లీ సమస్యలు మొదలవుతాయి.
ఈ విషయం తెలిసిన దివ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరికి స్నేహం, ప్రేమలో ఏది గెలిచింది? అన్నదే సినిమా కథ.
వివరాలు
అబ్బాస్‌కు ఇదే తొలి సినిమా..
అబ్బాస్‌కు నటుడిగా ఇదే తొలి సినిమా. అప్పట్లో వినీత్ పేరు కూడా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.
టబు అప్పటికి తెలుగులో రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. ఇక తమిళ దర్శకుడు కదిర్ గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.
అయినప్పటికీ అనువాద చిత్రంగా తెలుగులో విడుదలైన 'ప్రేమదేశం' ఘన విజయం సాధించింది. తమిళంలో 'కాదల్‌దేశం' పేరుతో ఈ చిత్రం తెరకెక్కింది.
ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ప్రతి పాటా ఓ ఆణిముత్యమే. ముఖ్యంగా 'ముస్తఫా ముస్తఫా.. డోంట్ వర్రీ ముస్తఫా.. కాలం నీ నేస్తం ముస్తఫా..' పాట స్నేహానికి ప్రతీకగా నిలిచిపోయింది.
హలో డాక్టర్ హార్ట్ మిస్సాయ్యే..పాటలు కూడా అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.