Varanasi: సినిమా చరిత్రలో కొత్త మైలురాయి.. ఫస్ట్ ఇండియన్ సినిమాగా 'వారణాసి' రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'వారణాసి' (Varanasi)పై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా తాజాగా మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. జనవరి 5న 'వారణాసి' టైటిల్ టీజర్‌ను ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత లే గ్రాండ్ రెక్స్ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ టీజర్‌కు అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ విషయాన్ని లే గ్రాండ్ రెక్స్ థియేటర్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. దీంతో అక్కడ ప్రదర్శించబడిన తొలి భారతీయ సినిమా గ్లింప్స్‌గా 'వారణాసి' చరిత్ర సృష్టించింది.
Details
భారీ స్థాయిలో గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్
ఇది భారతీయ సినిమాకు లభించిన గొప్ప అంతర్జాతీయ గుర్తింపుగా అభిమానులు భావిస్తున్నారు. ఇదివరకు ఈ థియేటర్‌లో రజనీకాంత్ నటించిన 'కబాలి', ప్రభాస్ నటించిన 'బాహుబలి 2', 'సాహో' చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. అయితే సినిమా విడుదలకు ముందే, అంతటి భారీ స్థాయిలో గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషంగా నిలిచింది. యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో 'వారణాసి' రూపొందుతోంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబు 'రుద్ర' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం ఆయన ప్రాచీన భారతీయ యుద్ధ కళ అయిన కలరిపయట్టు (Kalarippayattu)లో ప్రత్యేక శిక్షణ పొందారు. అంతేకాదు, సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో మహేశ్‌బాబు రాముడిగా కూడా కనిపించనున్నట్లు సమాచారం.
Details
కుంభ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్
ఈ చిత్రంలో మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తుండగా, కుంభ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఐమ్యాక్స్ వెర్షన్‌లో కూడా రూపొందుతున్న 'వారణాసి' చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయాలని రాజమౌళి ప్రణాళిక రూపొందించారు. ఈ సినిమా 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఈ చిత్రం 2027 ఏప్రిల్ 9న విడుదల కానున్నట్లు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.