Telugu language day 2024: తియ్యని తేనెల పలుకులు.. మన తెలుగు పాట
పాలమీగడల కన్నా స్వచ్ఛంగా, పున్నమి వెన్నల కన్నా అందంగా ఉండేది మన తెలుగు భాష. ఈ విషయాన్ని ఎంతోమంది ప్రముఖులు నిరూపిస్తూ పాటలను రచించారు. తెలుగు సినీ కవులు తమ గేయాలతో మరింత కమనీయంగా మన తెలుగు భాషను చక్కదిద్దారు. అలా తెలుగు భాషమీద వచ్చిన కొన్ని రణమీయమైన పాటలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 'తెలుగు భాష తీయదనం.. తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం' అని సినీ గేయ రచయిత చంద్రబోస్ రచించిన పాట ఇప్పటికీ వింటూనే ఉంటాం.
పరభాష వ్యామోహంలో పడి తెలుగు భాష మరవొద్దు
ఇక రానా అరంగేట్ర చిత్రం 'లీడర్' మా తెలుగు తల్లి పాటను అద్భుతంగా వాడుకున్నారు. ఈ పాటకి వేటూరి సాహిత్యం అందించగా, మిక్కి జే మేయర్ బాణీ అందించారు. తెలుగును అభిమానించే వారందరి నుంచి ఈ పాట ప్రశంసలను అందుకుంది. తెలుగు భాషను మర్చిపోతే అమ్మానాన్నలను మరిచిపోయినట్టే అంటూ మాతృభాష ప్రాముఖ్యతను తెలియజెప్పే ఈ పాటను చంద్రబోస్ రచించారు. పరభాష వ్యామోహంలో పడి మన భాషను మరవొద్దని హితభోద చేసే ఈ పాట అందరిని ఆకట్టుకుంది. ఈ పాటకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించగా, ఎస్పీ చరణ్ అద్భుతంగా పాడారు.
'తెలుగు జాతి మనది' పాటను రచించిన సినారె
పల్లెటూరు సినిమాలోని 'గతమెంతో ఘనకీర్తి కలిగిన తెలుగోడా.. చెయ్యెత్తి జై కొట్టు' సాగే ఈ పాట తెలుగు వాడి కీర్తిని చాటిచెప్పింది. సీనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఇదే పాటని బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లోనూ వాడుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'తల్లా పెళ్లామా' చిత్రంలో 'తెలుగు జాతి మనది.. నిండుగా వెలుగు జాతి మనది' పాటను సినారె రచించారు. స్వాతంత్య్ర సమరంలో కూడా తెలుగు జాతి చేసిన పోరును ఈ పాట గుర్తు చేస్తుంది.