Temperature: ఫిబ్రవరిలోనే భానుడి ప్రతాపం.. 37 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లో వేసవి ఇంకా అధికారికంగా మొదలుకాకముందే భానుడి ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ప్రజలను వేడి, ఉక్కపోతతో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. శనివారం నందిగామ, కర్నూలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. విశాఖపట్నం, తుని, నరసాపురం, బాపట్ల తదితర ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.
Details
కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం
అలాగే అదే ప్రాంతంలో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం ఈ అల్పపీడనంతో కలిసిపోయినట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం ఆదివారం, సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. అలాగే పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి వానలు కురిసే అవకాశముందని పేర్కొంది. వేసవి వేడి ఒకవైపు పెరుగుతుండగా, మరోవైపు వర్షాల సూచనలతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి.