LOADING...
Poonam Kaur:త్రివిక్రమ్ శ్రీనివాస్ వీడియోపై పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు 
త్రివిక్రమ్ శ్రీనివాస్ వీడియోపై పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు

Poonam Kaur:త్రివిక్రమ్ శ్రీనివాస్ వీడియోపై పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళలకు తీవ్రమైన మానసిక వేదన కలిగించే వ్యక్తిగా ఆయనను పేర్కొంటూ, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా తప్పించుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కొన్ని మీడియా సంస్థలు, అలాగే 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) వంటి సినీ పరిశ్రమ సంఘాల మద్దతే కారణమని ఆమె ఆరోపించారు. డిసెంబర్ 30, 2025న 'X'లో చేసిన ఈ పోస్ట్‌తో టాలీవుడ్‌లో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.

వివరాలు 

ఆయన ఒక దుర్మార్గుడు

2001లో విడుదలైన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా రీ-రిలీజ్ ప్రమోషన్ల సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడిన వీడియోకు పూనమ్ స్పందించారు. ఆ వీడియోలో ఆయన డబ్బు,కీర్తి కంటే గౌరవాన్ని ఇచ్చే సినిమాల ప్రాముఖ్యతపై తాత్వికంగా మాట్లాడారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పూనమ్,ఇంగ్లీషులో స్పందిస్తూ.."ఆయన ఒక దుర్మార్గుడు.మహిళలను మానసికంగా వేధించి, ఏమీ తెలియనట్టు ముందుకు వెళ్లిపోతాడు. మీలాంటి మీడియా సంస్థలు, 'మా' అసోసియేషన్ అతడికి అండగా నిలవడమే ఇందుకు కారణం. ఇలాంటి వారిని బాధ్యత వహించేలా చేయడం లేదు"అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తెలుగులోనూ స్పందించిన ఆమె, మహిళలను వేధిస్తూ మానసికంగా కుంగదీసే ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన'మా' అసోసియేషన్,చిన్న విషయాలకే స్పందిస్తోందని, కానీ ఇంత తీవ్రమైన ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

వివరాలు 

పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

గత కొన్ని సంవత్సరాలుగా పూనమ్ కౌర్, త్రివిక్రమ్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆయన చర్యల వల్ల తన సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం కూడా నష్టపోయిందని, వృత్తిపరంగానే కాకుండా రాజకీయంగా కూడా దెబ్బతిన్నానని ఆమె పలు సందర్భాల్లో పేర్కొన్నారు. త్రివిక్రమ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్‌పై కూడా ఆమె గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2024లో జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణల సమయంలోనూ, తాను గతంలో త్రివిక్రమ్‌పై చేసిన ఫిర్యాదులను 'మా' అసోసియేషన్ మరోసారి పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

వివరాలు 

స్పందించని త్రివిక్రమ్ శ్రీనివాస్

తాజా సోషల్ మీడియా పోస్ట్‌తో ఈ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నందుకు కొందరు పూనమ్‌కు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు సరైన ఆధారాలు లేకుండా అస్పష్టమైన ఆరోపణలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు. పూర్తి వివరాలతో జర్నలిస్టులను ఆమె ఎందుకు సంప్రదించడం లేదని కూడా కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ఆరోపణలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్ కౌర్, ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బి.ఎ రాజు చేసిన ట్వీట్ 

Advertisement