Kara OTT Release Date: థియేటర్ల తర్వాత ఓటీటీలోకి 'కర'.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ధనుష్ హీరోగా నటించిన తాజా హీస్ట్ థ్రిల్లర్ 'కర' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్‌లో మే 28 నుంచి స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే మరో ఆసక్తికర అప్‌డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
వివరాలు
ఐదు భాషల్లో 'కర' స్ట్రీమింగ్
'కర' సినిమా మే 28 నుంచి కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ చిత్రం.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై మాత్రం మంచి ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాల విండో పూర్తి కావడంతో ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. పోర్ థోజిల్‌తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రేమలు సినిమాతో సౌత్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు ఇందులో కథానాయికగా నటించింది.
వివరాలు
సంగీతాన్ని అందించిన జివి. ప్రకాష్ కుమార్
ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సూరజ్ వెంజరమూడు, కె.ఎస్.రవికుమార్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె. గణేష్, థింక్ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీతాన్ని జివి. ప్రకాష్ కుమార్ అందించారు.
వివరాలు
'కర' మూవీ ఎలా ఉంది?
'కర' ఒక హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్, సామాజిక సందేశాలతో దర్శకుడు విఘ్నేశ్ రాజా సినిమాను రూపొందించారు. దొంగతనాలు మానేసి సాధారణ జీవితం గడపాలనుకున్న వ్యక్తి.. మళ్లీ బ్యాంక్ దోపిడీల వైపు ఎందుకు వెళ్లాడన్నదే కథలో ప్రధానాంశం. సినిమా ప్రారంభాన్ని దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా తొలి 15 నిమిషాల సన్నివేశాలు ప్రేక్షకులను కథలోకి పూర్తిగా లాగేస్తాయి. వర్షం కురుస్తున్న రాత్రి ఓ ఎమ్మెల్యే ఇంట్లో జరిగే దొంగతనం, ఆ తర్వాత పోలీస్ లాకప్ నుంచి తప్పించుకునే సన్నివేశాలను సహజంగా తెరకెక్కించారు. లైటింగ్, సౌండ్ డిజైన్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి.
వివరాలు
వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ
కేవలం దొంగతనాల కథగా కాకుండా.. ఆ కాలంలోని సామాజిక పరిస్థితులను కూడా దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఈ చిత్రంలో ధనుష్ 'కరస్వామి' పాత్రలో నటించగా.. అతని భార్య మల్లి పాత్రలో మమితా బైజు కనిపించింది. భార్య కోసం దొంగతనాలు మానేసి సాధారణ జీవితం గడిపే కర.. మళ్లీ ఎందుకు నేరాల దారిలోకి వెళ్లాడన్నదే సినిమా కథ. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.41 కోట్ల వసూళ్లకే పరిమితమై డిజాస్టర్‌గా నిలిచింది.