అల్లరి నరేష్ 62వ సినిమా: మూర్ఖత్వం బోర్డర్ దాటితే ఎలా ఉంటుందో చూపించబోతున్న నరేష్
అల్లరి నరేష్ తన రూటు మార్చి సీరియస్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. నాంది తో మొదలైన నరేష్ సీరియస్ సినిమాల ప్రయాణం ఉగ్రం వరకూ వచ్చింది. ప్రస్తుతం మరో క్రేజీ సినిమాను తీసుకొచ్చే పనిలో ఉన్నాడు నరేష్. ఈరోజు నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నరేష్ కెరీర్లో తెరకెక్కుతున్న 62వ సినిమా ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన కోసం రిలీజ్ చేసిన వీడియోలో, అల్లరి నరేష్ తన ఆఫీసులో కూర్చుంటే, దర్శకుడు సుబ్బు మంగాదేవి కాల్ చేసి కథ చెప్తానని బార్ కి పిలుస్తాడు. కోపం, బాధ, అసహ్యం ఇలా ఏ ఎమోషన్నయినా కొలవగలమని, మూర్ఖత్వాన్ని కొలవలేమని, అలాంటి మూర్ఖత్వం బోర్డర్ దాటినవాడి కథే ఈ సినిమా అని నరేష్ కి చెప్పేస్తాడు.
బార్ లోనే టెక్నీషియన్లను పరిచయం చేసిన దర్శకుడు
మూర్ఖత్వం బోర్డర్ దాటడం అంటే ఈ సినిమా కామెడీ జోనర్లో ఉండబోతుందని అర్థమవుతోంది. మరి అది నిజమా కాదా అనేది సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ వస్తేగానీ తెలియదు. ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నిర్మాత రాజేష్ దండా, బాలాజీ గుట్ట, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, ఎడిటర్ ఛోట కె ప్రసాద్ ని కూడా ఇందులోనే పరిచయం చేసారు. సినిమా ప్రకటన వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అదలా ఉంచితే నరేష్ ప్రస్తుతం సభకు నమస్కారం అనే సినిమాలో నటిస్తున్నాడు.