హ్యాపీ బర్త్ డే అల్లరి నరేష్: కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల లిస్టు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ తరం వారిలో హీరోగా యాభై సినిమాల మైలురాయిని దాటింది అల్లరి నరేష్ ఒక్కడే అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 2002లో అల్లరి సినిమాతో హీరోగా మారిన నరేష్, వరుసగా కామెడీ పంచే సినిమాలనే చేస్తూ వచ్చాడు. మధ్యలో నేను, ప్రాణం, గమ్యం వంటి సినిమాలు చేసి తన నటనలోని మరో కోణాన్ని చూపించాడు. ఈరోజు అల్లరి నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నరేష్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలు తెలుసుకుందాం. అల్లరి: ఈ పేరునే తన ఇంటి పేరుగా మారిపోయిందంటే అల్లరి సినిమా ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. రవిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను కేవలం నెలరోజుల్లోనే తెరకెక్కించారు.
నవ్వులు తెప్పించే నరేష్, కృష్ణ భగవాన్ కాంబినేషన్
కితకితలు: అల్లరి నరేష్ నాన్న ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నరేష్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇంట్లోవాళ్ళు బలవంతం చేయడంతో లావుగా ఉన్న అమ్మాయిని చేసుకుని అవస్థలు పడే పోలీస్ కథే కితకితలు. ఈ సినిమాలో నరేశ్, కృష్ణ భగవాన్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్లు అందరినీ అలరిస్తాయి. మా అల్లుడు వెరీగుడ్: ఈ సినిమాలో దొంగ పాత్రలో అల్లరి నరేష్ కనిపిస్తారు. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా, సూపర్ హిట్ గా నిలిచింది. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నరేష్ తో పాటు చేసే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ సినిమాలోనూ నరేష్, కృష్ణ భగవాన్ ల కాంబినేషన్ అందరికీ నచ్చుతుంది.
నరేష్ నటించిన సీరియస్ పాత్రలు
గమ్యం: అల్లరి నరేష్ కెరీర్లో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. గాలి శీను పాత్రలో కనిపించిన అల్లరి నరేష్, సినిమా మొత్తం నవ్వించి, చివర్లో మాత్రం ఏడిపిస్తాడు. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ గాలి శీను పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. శంభో శివ శంభో: రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమాలో నరేష్ పాత్ర చాలా బాగుంటుంది. చెవిటి వాడిగా నరేష్ నటన అందరినీ ఆకట్టుకుంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. నాంది: వరుసగా కామెడీ సినిమాలు ఫ్లాప్ అవుతుంటే కామెడీని వదిలి సీరియస్ సినిమాల వైపు నాంది సినిమాతో అడుగేసాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది.