LOADING...
Allu Aravind: చిత్ర పరిశ్రమలో 'ఎవరి కుంపటి వారిదే' : అల్లు అరవింద్ 
చిత్ర పరిశ్రమలో 'ఎవరి కుంపటి వారిదే' : అల్లు అరవింద్

Allu Aravind: చిత్ర పరిశ్రమలో 'ఎవరి కుంపటి వారిదే' : అల్లు అరవింద్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 15, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల తెలుగు సినిమాలు ఏకంగా ఏడు జాతీయ పురస్కారాలను గెలుచుకున్నాయి. సాధారణంగా ఇలాంటి ఘనత వచ్చినప్పుడు,చిత్ర పరిశ్రమ మొత్తంగా ఒక పెద్ద వేడుక నిర్వహించి విజేతలను సత్కరించడం ఆనవాయితీగా ఉండాలి. కానీ,ఇక్కడ పరిస్థితి "ఎవరి కుంపటి వారిదే" అన్నట్లుగా ఉంది. ఈ సందర్భంలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌(సైమా)ఆ బాధ్యతను స్వయంగా తీసుకుని,ఈ వేదికపై జాతీయ పురస్కార గ్రహీతలకు సన్మానం చేయడం ప్రశంసనీయమని నిర్మాత అల్లు అరవింద్‌ పేర్కొన్నారు. సెప్టెంబర్ 5,6 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సైమా 2025 వేడుకల వివరాలు వెల్లడించేందుకు, గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌,దర్శకులు అనిల్‌ రావిపూడి,ప్రశాంత్‌ వర్మ,నిర్మాతలు సాహు గారపాటి,సాయి రాజేశ్‌,నటుడు సందీప్‌ కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

వివరాలు 

మీరు జాతీయ అవార్డు కూడా గెలుస్తారు: అనిల్‌ రావిపూడి

ఈ సందర్బంగా జాతీయ పురస్కారాలను సాధించిన తెలుగు సినీ ప్రముఖులను సైమా ప్రత్యేకంగా సత్కరించింది. "నా మొదటి సినిమా 'పటాస్‌'కు గాను చిరంజీవి గారి చేతుల మీదుగా సైమా అవార్డు తీసుకోవడం నా జీవితంలో మరచిపోలేని అనుభవం. గత సంవత్సరం 'భగవంత్‌ కేసరి'కి సైమా అందుకుంటున్నప్పుడు, నిర్వాహకుడు విష్ణు 'మీరు జాతీయ అవార్డు కూడా గెలుస్తారు, ఈ చిత్రానికి ఆ స్థాయి ఉంది' అని చెప్పారు. ఆయన మాట నిజమైంది. వివిధ భాషల సినీ రంగాల ప్రతిభను ఒకే వేదికపైకి తీసుకురావడంలో సైమా కీలక పాత్ర పోషిస్తుంది" అని దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నారు.

వివరాలు 

సైమా ఒక పెద్ద పండుగ

"జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత మాకు అందిన మొదటి సత్కారం సైమా నుంచే రావడం మా అదృష్టం" అని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అభిప్రాయపడ్డారు. నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. "సైమా 13వ ఏడాదిలోకి అడుగుపెడుతుండటం సంతోషకరం. సంక్రాంతి, దీపావళిలా మా సినిమా కళాకారులందరికీ సైమా ఒక పెద్ద పండుగలా ఉంటుంది" అని అన్నారు. ఈ కార్యక్రమంలో సైమా అవార్డ్స్ నిర్వాహకులు విష్ణువర్ధన్‌ ఇందూరి, బృందా ప్రసాద్‌, అలాగే నటీనటులు వేదిక, ఫరియా అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.