Allu Arjun: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ను (Allu Arjun) గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొదట చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన పోలీసులు, అక్కడే అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. అనంతరం సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయనను విచారణ చేశారు. ఆ తర్వాత వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ఈ కేసులో చట్టప్రకారం అన్ని విధాలా చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.