Anupama: మౌనం వీడిన అనుపమ.. టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన గత రిలేషన్‌షిప్, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. గతంలో తాను అనుభవించిన టాక్సిక్ రిలేషన్‌షిప్, దాని కారణంగా ఎదుర్కొన్న మానసిక వేదన గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. సాధారణంగా ఒక పార్టనర్ పక్కన ఉన్నప్పుడు ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుందని అనుపమ చెప్పారు. కానీ తాను మాత్రం ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్నంతకాలం ప్రతి నిమిషం భయం, ఆందోళనతో గడిపానని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
మనసులోనే వందసార్లు ప్రాక్టీస్..
''ఆ రిలేషన్‌లో ఉన్నప్పుడు ప్రతి క్షణం చాలా భయంగా ఉండేది. నేను మామూలుగా చేసే పనులు కూడా సరిగ్గా చేయలేకపోయేదాన్ని.
ఏదైనా మాట్లాడే ముందు.. 'నేను ఇది మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఎలా స్పందిస్తారు?' అని మనసులోనే వందసార్లు ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. ప్రతిరోజూ ఒక రకమైన అనిశ్చితి, భయం నన్ను వెంటాడేవి.
అయితే మనం ఇలాంటి పరిస్థితిలోకి ఎలా వెళ్తామో మనకే తెలియదు.
చాలా నెమ్మదిగా, నిశ్శబ్దంగా మనల్ని ఆ పరిస్థితిలోకి తీసుకెళ్తారు'' అని ఆమె చెప్పుకొచ్చారు.
ఇరు కుటుంబాలు కలవడం, రెండు వైపులా ఒకరి ఇళ్లలో మరొకరు సమయం గడపడంతో 'ఈ వ్యక్తితోనే నా జీవితం' అని బలంగా నమ్మానని అనుపమ తెలిపారు.
వివరాలు
అనుపమ భావోద్వేగం..
అయితే ఆ తర్వాతే అసలు స్వరూపం బయటపడిందని చెప్పారు. క్రమంగా తనపై కంట్రోల్ మరింత పెరిగిపోయిందని ఆమె ఆరోపించారు.
''నా కెరీర్‌లో అత్యంత విజయవంతమైన 'డ్రాగన్' సినిమా ప్రమోషన్స్‌కు కూడా నేను ఎందుకు వెళ్లలేదో నాకు మాత్రమే తెలుసు.
ఎన్నో మంచి ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. నా జీవితంలోని ప్రతి విషయంలోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకునేవారు.
నా కుటుంబానికి, స్నేహితులకు నన్ను దూరం చేశారు. బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా 'ఎలా ఉన్నావు?' అని ప్రేమగా అడిగితే.. ఎక్కడ ఏడ్చేస్తానో అని భయపడేదాన్ని'' అంటూ అనుపమ భావోద్వేగానికి గురయ్యారు.
వివరాలు
సినీ వర్గాల్లో చర్చ..
ఎదుటి వ్యక్తి వల్ల తనకు ఎంత నష్టం జరుగుతున్నా, తనను ఎంతగా అడ్డుకుంటున్నా.. ఒకానొక దశలో తన కుటుంబం నుంచి కూడా ఆ వ్యక్తిని తానే కాపాడుతూ వచ్చానని అనుపమ తెలిపారు.
ఈ క్రమంలో స్నేహితులకు కూడా క్రమంగా దూరమయ్యానని చెప్పారు.
అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు, ఆమె వెల్లడించిన టాక్సిక్ రిలేషన్‌షిప్ అనుభవాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వ్యవహారంపై అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి క్లారిటీ లేదా వివరణ వస్తుందనే దానిపై సినీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.