AR Rahman: చెన్నైలో ఏఆర్ రెహమాన్ కుమారుడికి ప్రమాదం.. స్వల్ప గాయాలతో సేఫ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అమీన్ ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ఓ క్యాబ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అమీన్‌తో పాటు ఆయన స్నేహితుడు, క్యాబ్‌లో ఉన్న ఓ ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
వివరాలు
క్యాబ్ ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో అమీన్ తన స్నేహితుడితో కలిసి జవహర్‌లాల్ నెహ్రూ రోడ్డులో గిండి వైపు ప్రయాణిస్తున్నారు.
ఒలింపియా టెక్ పార్క్ వద్దకు వారి కారు చేరుకోగానే.. ఓ పక్క రోడ్డు నుంచి క్యాబ్ ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి వచ్చింది. దీంతో అమీన్ ప్రయాణిస్తున్న కారు క్యాబ్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అమీన్, ఆయన స్నేహితుడితో పాటు క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి.
వెంటనే ముగ్గురినీ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. అనంతరం అందరినీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
వివరాలు
రెండు వాహనాలు ధ్వంసం
ప్రమాదం కారణంగా అమీన్ ప్రయాణిస్తున్న కారు, క్యాబ్ రెండూ దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రమాదంపై అడయార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ (TIW) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని నిర్ధారించేందుకు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
అలాగే అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.