Toxic: యశ్ 'టాక్సిక్'కు బిగ్ షాక్.. టీజర్ తొలగించాలంటూ మహిళా కమిషన్ లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
యశ్ హీరోగా నటిస్తున్న అప్‌కమింగ్ చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'కు భారీ షాక్ తగిలింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ (KSWC) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు లేఖ రాసింది. టీజర్‌లోని అభ్యంతరకర, అశ్లీల సన్నివేశాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటీవల యశ్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదలైన 'టాక్సిక్' టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులోని కొన్ని సన్నివేశాలు మరీ బోల్డ్‌గా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒక ఇంటిమేట్ సీన్ తీవ్ర వివాదానికి కారణమైంది.
Details
సెన్సార్ బోర్డుకు లేఖ
ఈ నేపథ్యంలో కర్ణాటక మహిళా కమిషన్ సెన్సార్ బోర్డుకు లేఖ రాయడంతో, యశ్ 'టాక్సిక్' సినిమాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయింది. యశ్ నటించిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' టీజర్‌లో కారులో ఓ మహిళతో శృంగార సన్నివేశం చూపించారు. ఆ తర్వాత యశ్ బయటకు వచ్చి కొంతమందిని కాల్చి చంపే దృశ్యాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ టీజర్‌పై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం (జనవరి 12) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పీటీఐ కథనం ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం నాయకులు మహిళా కమిషన్ అధికారులను కలిసి అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు.
Details
అశ్లీల సన్నివేశాలను తొలగించాలి
టీజర్‌లో అశ్లీల సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్, సీబీఎఫ్‌సీకి లేఖ రాసి "తగిన చర్యలు" తీసుకోవాలని కోరింది. ఈ టీజర్‌లోని అభ్యంతరకరమైన, స్పష్టమైన కంటెంట్ మహిళలు, పిల్లల సామాజిక శ్రేయస్సుకు తీవ్ర హాని కలిగిస్తోందని ఆప్ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ లేఖలో పేర్కొన్నారు. వయోపరిమితి హెచ్చరిక లేకుండా ఈ సన్నివేశాలను బహిరంగంగా విడుదల చేయడం మహిళల గౌరవాన్ని కించపరుస్తోందని,కన్నడ సంస్కృతిని అవమానిస్తోందని ఆమె విమర్శించారు. అలాగే ఈ కంటెంట్ సమాజంపై, ముఖ్యంగా మైనర్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, టీజర్‌ను నిషేధించాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించాలని పార్టీ కోరింది.
Details
మార్చి 19న రిలీజ్
ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం తరపున ఈ అంశాన్ని మహిళా కమిషన్ అత్యంత గంభీరంగా పరిగణించి, రాష్ట్ర సాంస్కృతిక మరియు నైతిక విలువలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్టు లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై నియమావళి ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కమిషన్ కార్యదర్శి సెన్సార్ బోర్డును కోరినట్లు లేఖలో వెల్లడించారు. 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' టీజర్‌ను యశ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న విడుదల చేశారు. యాక్షన్‌తో పాటు బోల్డ్ కంటెంట్ ఉన్న ఈ టీజర్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.