Director Shiva Nirvana: ఇరుముడితో బ్లాక్‌బస్టర్ హిట్.. డైరెక్టర్ కాకముందు శివ నిర్వాణ ఏం చేసేవారో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా విజయంతో దర్శకుడు శివ నిర్వాణ పేరు మరోసారి టాలీవుడ్‌లో మార్మోగుతోంది. అయితే దర్శకుడిగా మారకముందు ఆయన ఏం చేసేవారో తెలుసా? టీచర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకున్న శివ నిర్వాణ.. సినిమా కోసం ఏకంగా 12-13 ఏళ్ల పాటు పోరాడారు. శివ నిర్వాణ బీఈడీ పూర్తి చేసి టీచింగ్ వృత్తికి అర్హత సాధించారు. అయితే చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆయనకు ఎంతో ఆసక్తి. ఉన్నత చదువులు పూర్తి చేయాలన్న తండ్రి కోరికను గౌరవిస్తూ ఎంఎస్సీ కూడా పూర్తి చేశారు. చదువుకున్నది సినిమాల్లో ఎక్కడో ఒకచోట ప్రతిబింబిస్తుందని భావించి..చివరకు సినీ రంగం వైపు అడుగులు వేశారు.
వివరాలు
పుస్తకాలే కథలకు పునాది..
చిన్నతనంలోనే బాలమిత్ర, చందమామ, బుజ్జాయి వంటి పుస్తకాలు చదివే అలవాటు శివ నిర్వాణకు ఉండేది.
నాలుగో తరగతి నుంచే ఆయన తండ్రి ప్రతి నెలా ఈ పుస్తకాలను ఇంటికి తెప్పించేవారట.
ఇంటర్మీడియట్‌లో సబ్బవరంలోని లైబ్రరీకి వెళ్లి యండమూరి వీరేంద్రనాథ్ నవలలను విస్తృతంగా చదివారు.
'తులసీదళం' వంటి నవలల ద్వారా కథలో డ్రామాను ఎలా పండించాలి? కథను ఎలా నిర్మించాలి? అనే విషయాలను నేర్చుకున్నానని శివ నిర్వాణ తెలిపారు.
పుస్తకాల్లో చదివిన కథలను సినిమాలుగా ఎలా మలచవచ్చనే ఆలోచన కూడా అప్పుడే ఆయనలో మొదలైంది.
యండమూరి వీరేంద్రనాథ్ రాసిన 'అభిలాష', 'ఛాలెంజ్' వంటి నవలలను ఉదాహరణగా తీసుకుని పుస్తకానికీ, సినిమాకీ మధ్య ఉన్న అనుసంధానాన్ని అర్థం చేసుకున్నానని చెప్పారు.
వివరాలు
12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం..
సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత శివ నిర్వాణ ప్రయాణం అంత సులభంగా సాగలేదు.
కృష్ణానగర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సీరియల్స్ నుంచి సినిమాల వరకు అనేక ప్రాజెక్టుల్లో పనిచేశారు.
దాదాపు 12-13 ఏళ్ల పాటు అవకాశాల కోసం ఎదురుచూశారు. ఈ సమయంలో ఐదారుగురు నిర్మాతలు సినిమా చేస్తామని చెప్పి చివరకు వెనక్కి తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.
మనం జీరోగా ఉన్నప్పుడు మనలో ఎంత టాలెంట్ ఉన్నా ఎవరికీ తెలియదని, ఎవరో ఒకరు అవకాశం ఇచ్చే వరకు ఎదురుచూడక తప్పదని తెలిపారు.
అయినా తాను నిరాశ చెందలేదని.. డైరెక్టర్ కాకపోయినా అసిస్టెంట్ డైరెక్టర్‌గా అయినా ఇండస్ట్రీలో కొనసాగాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
వివరాలు
షార్ట్‌ఫిల్మ్స్‌తో టర్నింగ్ పాయింట్..
దర్శకుడు పరశురామ్ దగ్గర రెండు సినిమాలకు పనిచేసిన తర్వాత తనను తాను పరీక్షించుకోవాలని శివ నిర్వాణ షార్ట్‌ఫిల్మ్స్ తీయడం ప్రారంభించారు.
'వన్ మోర్ స్మైల్', 'లవ్ ఆల్జీబ్రా' వంటి షార్ట్‌ఫిల్మ్స్ యూట్యూబ్‌లో మంచి స్పందన తెచ్చుకున్నాయి.
ఇవి ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఈ షార్ట్‌ఫిల్మ్స్ చూసిన అమెరికాకు చెందిన ఎన్నారై శివ తుర్లపాటి ఆయనకు పరిచయమయ్యారు.
షార్ట్‌ఫిల్మ్స్ కాకుండా నేరుగా సినిమా చేయాలని, తక్కువ బడ్జెట్‌లోనూ సినిమా నిర్మించవచ్చని ఆయన సూచించారు.
ఈ క్రమంలో శివ నిర్వాణ చెప్పిన ఓ కథ నేరుగా ముందుకు వెళ్లకపోయినా.. శివ తుర్లపాటికి కోన వెంకట్‌తో ఉన్న పరిచయం కారణంగా ఆ కథ ఆయన వరకు వెళ్లింది.
వివరాలు
నాని ఒక్క సిట్టింగ్‌లో ఓకే..
చివరకు కథను హీరో నానికి చెప్పగా.. ఒక్క సిట్టింగ్‌లోనే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని శివ నిర్వాణ తెలిపారు.
ఆ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచి ఆయనను దర్శకుడిగా నిలబెట్టింది.
తన కథలను స్నేహితులకు చెప్పినప్పుడు వారు ఆసక్తిగా వినడాన్ని గమనించి తాను మంచి కథకుడినని గుర్తించానని శివ నిర్వాణ చెప్పారు.
సంస్కృతంలోని 'కథితం హి కథః' అంటే బాగా చెప్పబడిందే కథ అనే భావన తనను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపారు.
టీచర్‌గా మారే అవకాశం ఉన్నప్పటికీ.. పుస్తకాలపై ప్రేమ, సినిమాలపై పిచ్చితో ఇండస్ట్రీలోకి వచ్చిన శివ నిర్వాణ.. ఎన్నో కష్టాలు, అవమానాలు, నిరీక్షణలను దాటి దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు.