CBFC: సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. 500కుపైగా సినిమాల రికార్డులు బహిర్గతం
ఈ వార్తాకథనం ఏంటి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC)లో భారీ డేటా లీక్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 500కుపైగా సినిమాలకు సంబంధించిన ధ్రువీకరణ రికార్డులు బయటపడినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వీటిలో ఫీచర్ ఫిల్మ్‌లకు సంబంధించిన వివరాలతోపాటు, సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు సెన్సార్ అనుమతి పొందే క్రమంలో నిర్మాతలు సమర్పించిన స్క్రిప్టులు, కట్ ఆర్డర్లు, ఇతర కీలక పత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం. సెన్సార్ ప్రక్రియను డిజిటలైజ్ చేయడంలో భాగంగా సీబీఎఫ్సీ సుమారు పదేళ్ల క్రితం ఈ-సినీప్రమాణ్ (eCinepramaan) పేరుతో ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. సినిమా ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేసుకునే నిర్మాతలు ఈ పోర్టల్ ద్వారానే అవసరమైన పత్రాలను సమర్పిస్తుంటారు.
వివరాలు
సైబర్ అధికారులకు ఫిర్యాదు
అయితే, ఇప్పుడు ఈ పోర్టల్ నుంచే కీలకమైన సమాచారం లీకైనట్లు వెల్లడైంది.
ఆన్లైన్లో భద్రపరిచే కంటెంట్‌ను అందుబాటులో ఉంచే లాభాపేక్షలేని డిజిటల్ లైబ్రరీ అయిన ఇంటర్నెట్ ఆర్కైవ్ ద్వారా ఈ రికార్డులను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఏర్పడింది.
డేటా లీక్ విషయం బయటపడిన అనంతరం సంబంధిత సమాచారాన్ని తొలగించినట్లు ఇంటర్నెట్ ఆర్కైవ్ తెలిపింది.
ఈ ఘటనపై సైబర్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.
మరోవైపు, డేటా లీక్‌పై దర్యాప్తు చేస్తున్నామని సీబీఎఫ్సీ ప్రకటించింది.
ఈ-సినీప్రమాణ్ పోర్టల్ భద్రతను సమీక్షించడంతోపాటు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
పోర్టల్‌లో అనధికారికంగా ప్రవేశించి సమాచారం పొందారనే ఆరోపణలకు సంబంధించి వివరాలను పరిశీలించినట్లు పేర్కొంది.
వివరాలు
బహిర్గతమైన పత్రాలను ఇతరులు యాక్సెస్ చేసినట్లు ఆధారాలు లేవు:సీబీఎఫ్సీ
అయితే, బహిర్గతమైన పత్రాలను ఇతరులు యాక్సెస్ చేసినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఎఫ్సీ స్పష్టం చేసింది.
అలాగే, ఏ ఒక్క చిత్రనిర్మాత ఖాతా హ్యాక్ అయినట్లు కూడా కనిపించడం లేదని వెల్లడించింది.
దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని తెలిపింది.