Sridevi: వెండితెర చాందినీ.. గ్లామర్, గ్రేస్‌కు మారుపేరు శ్రీదేవి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేక్షకులు ఇప్పటికీ 'పదహారేళ్ల వయసు' దగ్గరే నిలిచిపోయారు. అభిమానులు 'వేటగాడు' వానలో తడిసి ముద్దవుతూనే ఉన్నారు. వయసు మీరినా కుర్రకారులో 'ప్రేమాభిషేకం' జ్వరం తగ్గలేదు. మహిళా హృదయాల్లో 'కార్తీక దీపం' వెలిగించిన 'దేవత' ఎప్పటికీ 'అతిలోక సుందరి'గానే నిలిచిపోయింది. ఆమె వెళ్లిపోయి ఎనిమిదేళ్లు గడిచినా, దేవుడా... దేవుడా... అంటూ ముద్దులొలికే గుంటూరు అమ్మాయి మరుపునకు రాలేదు. ఆ పేరు - శ్రీదేవి. ఆమెకు నీళ్లు అంటే అమితమైన ఇష్టం. నీళ్లలో షూటింగ్ అంటే ఇష్టం... ఈత కూడా వచ్చు... నీళ్లతో ఆడితే ఆనందంగా ఉంటుందని చెప్పిన ఈ నటి, పిల్లలు కూడా మునగలేని బాత్‌టబ్‌లో నిర్జీవంగా కనిపించడం విధి వైపరీత్యం.
Details
తల్లిదండ్రుల బోధనలు
సినిమాల్లో ఎదుగుతున్న సమయంలో తండ్రి అయ్యప్పన్ ఒకే మాట చెప్పారు. నిజాయితీగా పని చెయ్, అది నిన్ను కాపాడుతుంది. తల్లి రాజేశ్వరమ్మ మూడు సూత్రాలు నేర్పింది. 1. హీరోయిన్‌కి ముక్కు చక్కగా ఉండాలి. 2. మనసులోని మాట పెదవి దాటకూడదు. 3. పెదవులపై ఎప్పుడూ నవ్వు ఉండాలి. శ్రీదేవి పెదవులపై ఆ నవ్వు ఎప్పుడూ మెరుస్తూనే ఉండేది. కానీ ఆమె మనసు ఎవరికీ అంతగా విప్పి చెప్పేది కాదు.
Details
ముక్కు సర్జరీ చర్చలు
బొబ్బిలిపులి విడుదలైనప్పుడు ఆమె ముక్కు సర్జరీ గురించి చర్చలు దక్షిణాదిలో మొదటిసారి వినిపించాయి. ఆ సినిమాలో కొన్ని సీన్లలో సర్జరీకి ముందు, మరికొన్ని సీన్లలో సర్జరీ తర్వాత రూపంలో కనిపించింది. ఆ కాలంలో సాధారణ ప్రజలు 'ముక్కుకు ఆపరేషన్' అనే మాట వినడం అరుదు. చివరి దశ వరకు ఆమె తన ముక్కును సరిచేసుకుంటూనే ఉండింది. 'ఇంగ్లిష్ వింగ్లిష్' సమయానికి ఆమె రూపం మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
Details
గ్లామర్ - కమర్షియల్ సినిమా సమీకరణం
సినిమా ఒక కమర్షియల్ వ్యాపారం. హీరోయిన్ తెరపై గ్లామరస్‌గా కనిపించాలి. "సిస్టర్ ఫీలింగ్" రాకూడదు - నేల క్లాస్ ప్రేక్షకుడి భాషలో ఇదే ప్రమాణం. ఆ సమయంలో జయసుధ, జయప్రదలు ప్రధానంగా నటన ఆధారిత పాత్రలు చేసేవారు. కానీ శ్రీదేవి పెర్ఫార్మెన్స్‌తో పాటు మోడ్రన్ గ్లామర్‌ను సహజంగా మిళితం చేసింది. వేటగాడులో 'జాబిలితో చెప్పనా' పాటలో మేక్సీ వేసుకుని కనిపించగానే ఊళ్లలో ఆడపిల్లలు మేక్సీలు కుట్టించుకున్నారు. ఆ సినిమాకు ముందు ఎన్టీఆర్‌కు పలువురు హీరోయిన్లు ఉన్నా, తర్వాత ఎక్కువగా శ్రీదేవే కనిపించింది
Details
అక్కినేని - దాసరి - ప్రేమాభిషేకం
అక్కినేని నాగేశ్వరరావు ప్రాణాలిచ్చే ప్రేమను చూపించాలంటే ఆ ప్రేమికురాలు శ్రీదేవి కావాలనిపించేది. దాసరికి అది బాగా తెలుసు. అందుకే 'ప్రేమాభిషేకం' అక్కినేని సినిమా మాత్రమే కాదు, శ్రీదేవి వల్ల కూడా ఆ సినిమా మరింత ఎత్తుకెక్కింది. తర్వాత కెరీర్ కొంత డల్‌గా ఉన్న సమయంలో 'శ్రీరంగనీతులు' హిట్‌గా నిలిచింది. కృష్ణ, అమితాబ్, ఇతర హీరోలు కృష్ణకు కూడా శ్రీదేవి జోడీ ప్లస్ అయ్యింది. 'ఖైదీ రుద్రయ్య' హిట్. 'మహారాజశ్రీ మాయగాడు' సరిగ్గా ఆడకపోయినా వారిద్దరి కామెడీ గుర్తుండిపోయింది. బాలీవుడ్‌లో కూడా ఆమె ప్రభావం స్పష్టమే. అమితాబ్ బచ్చన్ 'ఆఖరీ రాస్తా' కోసం నిజంగానే రోజూ లారీడు ఫ్లవర్ బొకేలు పంపించి ఒప్పించాడనే కథలు వినిపించాయి.
Details
రాఘవేంద్రరావు - స్టార్‌డమ్
శ్రీదేవి ఎవరికైనా రుణపడి ఉండాలంటే అది కె. రాఘవేంద్రరావు**కే. ఆయన 'వేటగాడు'తో తెలుగులో, హిమ్మత్‌వాలాతో హిందీలో స్టార్‌గా తీర్చిదిద్దారు. ఆమె స్టార్‌డమ్‌తో నాగార్జునకు 'ఆఖరి పోరాటం', చిరంజీవికి జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి మెగాహిట్స్ వచ్చాయి. అనిల్ కపూర్‌కు మిస్టర్ ఇండియా, రిషి కపూర్‌కు చాందినీ హిట్స్ ఆమె వల్లే మరింత ఎత్తుకెక్కాయి. 'ఖుదాగవా'కి ఆమె సైన్ చేసిందని విని అమితాబ్ ఆనందించాడనే మాటలు అప్పట్లో వినిపించాయి. జితేంద్ర కెరీర్‌లోనూ ఆమె పాత్ర విశేషం.
Details
తమిళం - కమల్ - కామిక్ టైమింగ్
తమిళంలో ఆమె ప్రతిభను మరింతగా వినియోగించారు. 'ఆకలి రాజ్యం'లో ఆమె ఇంటెలెక్చువల్, మెచ్యూర్డ్ పాత్రలో మెరిసింది. కమల్ హాసన్‌తో కలిసి నటించిన 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు' పెద్ద హిట్ అయినా, ఆ ప్రింట్ దొరకడం కష్టమే. ఆమె కామిక్ టైమింగ్‌కి అది ఉదాహరణ. అదే టైమింగ్‌తో హిందీలో చాల్‌బాజ్‌లో చెలరేగి బాలీవుడ్‌ను కుదిపేసింది. అందులో రజనీకాంత్, సన్నీ డియోల్ హీరోలైనా, ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచింది మాత్రం శ్రీదేవే. కల్ట్ క్లాసిక్ - చిరస్థాయి జ్ఞాపకం క్షణక్షణంతో ఒక కల్ట్ క్లాసిక్‌ను వదిలి వెళ్లింది. ఆమె ఆఖరి బింబాన్ని అక్కడే ఆపుకుంటే అభిమానులకు సంతోషం. 50ఏళ్లు నటించిన జీనియస్ నటి. మరో నూటయాభై ఏళ్లు గడిచినా స్మరణలో నిలిచే పేరు - శ్రీదేవి.