Bobby Deol: అలియాతో విభేదాల రూమర్లపై క్లారిటీ.. ఇన్‌స్టా వార్తలపై బాబీ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
వరుస సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైన బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రస్తుతం అలియా భట్ నటిస్తున్న 'ఆల్ఫా' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బాబీ దేవోల్, అలియా భట్ మధ్య విభేదాలు నెలకొన్నాయంటూ ఇటీవల సోషల్ మీడియాలో పలు రూమర్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ప్రచారాలపై బాబీ దేవోల్ స్పందిస్తూ వాటిని పూర్తిగా ఖండించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఈ రూమర్లకు సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ను నాకు పంపించారు. అది చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. ప్రజలకు ఎంత ఖాళీ సమయం ఉంటుందో అప్పుడు అర్థమైంది. నేను గతంలో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి 'యానిమల్' సినిమాలో నటించాను.
వివరాలు
వాళ్లంటే నాకు ఎంతో ఇష్టం
ఇప్పుడు అలియా భట్‌తో కలిసి పనిచేస్తున్నాను. వాళ్లిద్దరూ నాకు ఎంతో ఇష్టమైన నటీనటులు. ముఖ్యంగా అలియా చాలా కష్టపడి పనిచేస్తోంది. యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని ఎంతో అంకితభావంతో సిద్ధమవుతోంది. మేమంతా ఎంతో ప్రశాంతంగా షూటింగ్ చేస్తుంటే ఇలాంటి కథనాలు ఎందుకు సృష్టిస్తారో అర్థం కావడం లేదని అన్నారు. అంతేకాకుండా తన కోపాన్ని తగ్గించేందుకు నిర్మాత ఆదిత్య చోప్రా మరో సినిమా ఆఫర్ చేశారంటూ వచ్చిన ప్రచారాన్ని కూడా ఆయన కొట్టిపారేశారు. ఇలాంటి రూమర్లు సృష్టించే ప్రతి ఒక్కరికీ వెళ్లి నిజాలు చెప్పడం సాధ్యం కాదు.
వివరాలు
జూలై 10న రిలీజ్
సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే వార్తల్లో 90 శాతం వరకు అసత్యాలే ఉంటాయంటూ బాబీ దేవోల్ వ్యాఖ్యానించారు. కాగా, అలియా భట్, శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'ఆల్ఫా' చిత్రం ప్రముఖ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా, శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్నారు. జులై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ దేవోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.