Loading...
Sandeep Saroj: మెగాస్టార్ క్లాసిక్ టైటిల్‌తో 'కమిటీ కుర్రోళ్లు' హీరో.. ఘనంగా మొదలైన 'వేట'!
మెగాస్టార్ క్లాసిక్ టైటిల్‌తో 'కమిటీ కుర్రోళ్లు' హీరో.. ఘనంగా మొదలైన 'వేట'!

Sandeep Saroj: మెగాస్టార్ క్లాసిక్ టైటిల్‌తో 'కమిటీ కుర్రోళ్లు' హీరో.. ఘనంగా మొదలైన 'వేట'!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సందీప్ సరోజ్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వేట'. ఈ సినిమాలో సాత్విక కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంతో అశోక్ కోటిపల్లి దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. ఎస్ఆర్డీ ప్రొడక్షన్స్ (శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్), ఈటీవీ విన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఫణి అడపాక, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం సినీ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

వివరాలు

ముఖ్య అతిథిగా నాగబాబు

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు, ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్, దర్శకులు మెహర్ రమేష్, వీఎన్ ఆదిత్య, సాయి రాజేష్, ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్, అనుదీప్ దేవ్, యదు వంశీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ క్లాప్ కొట్టారు.

సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, నిర్మాత ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

వివరాలు

'వేట' టైటిల్‌పై సందీప్ సరోజ్

ఈ సందర్భంగా హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ.. 'కమిటీ కుర్రోళ్లు' సినిమాకు ప్రేక్షకులు అందించిన ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.

ఇప్పుడు తమ కొత్త సినిమా ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసిక్ మూవీ 'వేట' టైటిల్‌ను తమ కథకు పెట్టుకున్నామని సందీప్ సరోజ్ వెల్లడించారు.

తమ కథాంశానికి ఈ పేరు వంద శాతం సరిపోతుందని, తమ ప్రయత్నాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు

'పెదరాయుడు' తరహా గ్రామ పెద్దగా కేఎస్ రవికుమార్

సీనియర్ దర్శకుడు, నటుడు కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు అశోక్ కోటిపల్లి చెప్పిన కథలోని పాయింట్ తనకు ఎంతో నచ్చిందని తెలిపారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో తాను 'పెదరాయుడు' తరహాలో హుందాగా ఉండే గ్రామ పెద్ద పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు.

కథలో మంచి భావోద్వేగాలు ఉన్నాయని, నేటి తరం యువతకు కూడా ఈ సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక కేఎస్ రవికుమార్ ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

'వేట' చిత్రంతో సందీప్ సరోజ్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ADVERTISEMENT