Dalai Lama: 90 ఏళ్ల వయసులో దలైలామాకు గ్రామీ అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందారు. బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీటెల్లింగ్ రికార్డింగ్ విభాగంలో ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. 90 ఏళ్ల వయసులో తన తొలి గ్రామీ అవార్డును అందుకోవడం విశేషంగా నిలిచింది. ఈ ఘనత సంగీత రంగంతో పాటు సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లోనూ ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు. 'మెడిటేషన్స్: ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలినెస్ ది దలైలామా' (Meditations: The Reflections of His Holiness the Dalai Lama) అనే ఆల్బమ్‌కు గాను దలైలామాకు ఈ పురస్కారం లభించింది.
Details
సందేశాలను ఆడియో రూపంలో అందించారు
ఈ ఆల్బమ్‌లో ఆయన తన ఆలోచనలు, సందేశాలను ఆడియో రూపంలో ప్రపంచానికి అందించారు. ధ్యానం, శాంతి, దయ, అంతర్ముఖ పరిశీలన వంటి అంశాలపై స్వయంగా చెప్పిన భావాలను స్పోకెన్-వర్డ్ ఆల్బమ్ రూపంలో ప్రజలకు చేరువ చేశారు. దలైలామా ప్రసంగాలకు ప్రసిద్ధ సరోద్ వాయిద్యకారుడు అంజద్ అలీ ఖాన్ నేపథ్య సంగీతాన్ని అందించడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల వేడుకను ది రికార్డింగ్ అకాడమీ ఆధ్వర్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా నిర్వహించారు. 68వ గ్రామీ అవార్డుల వేడుకలో ప్రపంచవ్యాప్తంగా తమ పాటలు, ఆల్బమ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కళాకారులు వివిధ విభాగాల్లో పురస్కారాలు అందుకున్నారు.