Loading...
HANUMAN ANSH CREATES HISTORY: ధురంధర్‌, పుష్ప రికార్డులు బద్దలు.. 'హనుమాన్‌ అంశ్‌' జోరుకు బ్రేకుల్లేవ్‌!
ధురంధర్‌, పుష్ప రికార్డులు బద్దలు.. 'హనుమాన్‌ అంశ్‌' జోరుకు బ్రేకుల్లేవ్‌!

HANUMAN ANSH CREATES HISTORY: ధురంధర్‌, పుష్ప రికార్డులు బద్దలు.. 'హనుమాన్‌ అంశ్‌' జోరుకు బ్రేకుల్లేవ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2026
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌ఇండియా స్థాయిలో భారీ విజయాలు సాధించిన 'ధురంధర్‌', 'పుష్ప 2' వంటి చిత్రాలనే ఓ చిన్న సినిమా వసూళ్లలో వెనక్కి నెట్టడం సాధ్యమేనా? అదీ హిందీ మినహా మరే భాషలోనూ విడుదల కాని చిత్రం.. అంటే నమ్మడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ బాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే జరిగింది. 'హనుమాన్ అంశ్‌' అనే చిన్న చిత్రం పాన్‌ఇండియా సినిమాల రికార్డులను బద్దలు కొడుతూ సంచలన వసూళ్లు సాధిస్తోంది. ఏకంగా అయిదో వారాంతం కలెక్షన్లలో 'ధురంధర్‌', 'పుష్ప 2' వంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు.

వివరాలు

మూడో వారం నుంచి పెరిగిన కలెక్షన్లు

ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'హనుమాన్ అంశ్‌'కు తొలి రెండు వారాల్లో పెద్దగా స్పందన రాలేదు. అయితే పాజిటివ్‌ మౌత్‌ టాక్‌ కారణంగా మూడో వారం నుంచి సినిమా కలెక్షన్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి.

ఆ తర్వాత వరుసగా వసూళ్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. విడుదలైన 31 రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడం విశేషం.

ఇక సెప్టెంబరు 4 నుంచి 6 వరకు సాగిన అయిదో వారాంతంలో ఏకంగా రూ.45.60 కోట్ల వసూళ్లు రాబట్టింది.

దీంతో అయిదో వారాంతంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో 'హనుమాన్ అంశ్‌' అగ్రస్థానంలో నిలిచింది.

వివరాలు

రూ.45.60 కోట్లతో తొలి స్థానం

ఈ క్రమంలో 'ధురంధర్‌: పార్ట్‌ 1' అయిదో వారాంతంలో సాధించిన రూ.35.80 కోట్ల వసూళ్లను 'హనుమాన్ అంశ్‌' అధిగమించింది.

అలాగే 'ఛావా' రూ.22 కోట్లు, 'స్త్రీ 2' రూ.16కోట్లు, 'పుష్ప 2' హిందీ వెర్షన్‌ రూ.14 కోట్లు, 'ధురంధర్‌ 2' రూ.12.75కోట్ల వసూళ్లను కూడా వెనక్కి నెట్టింది.

బాలీవుడ్‌ విశ్లేషకుల ప్రకారం ఈ జాబితాలో 'హనుమాన్ అంశ్‌' రూ.45.60 కోట్లతో తొలి స్థానాన్ని దక్కించుకుంది.

ఇప్పటికే స్వదేశంలో ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. విదేశీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబరు 11న ఓవర్సీస్ మార్కెట్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

అక్కడ కూడా ఇదే స్థాయిలో ఆదరణ లభిస్తే 'హనుమాన్ అంశ్‌' వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ADVERTISEMENT